సోలార్‌పై కేంద్రం బాదుడు

–  ఉపకరణాలపై భారీగా పన్నులు పెంపు
–  సబ్సిడీల కుదింపు
–  ఈనెల 15 నుంచి అమల్లోకి…
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సోలార్‌ విద్యుదుత్పత్తిపై కేంద్రం కొరడా ఝళిపించింది. ఇప్పటి వరకు దీనిపై ఇస్తున్న సబ్సిడీల్లో భారీగా కోతలు విధించింది. అలాగే సోలార్‌ ఉపకరణాలపై పన్నులనూ పెంచేసింది. ఫలితంగా వినియోగదారులపై మరింత ఆర్థికభారం పడనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలు ఈనెల 15 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేశంలోనే సోలార్‌ విద్యుదుత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ ప్రగతిని నిరోధించేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర నిర్ణయాల వల్ల 40 గిగావాట్ల ప్రాజెక్టులు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే… పర్యావరణ పరిరక్షణ పేరుతో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని తగ్గించుకొని, పునరుత్పాదక విద్యుదుత్పత్తిపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని గతంలో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా జెన్‌కోలు థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని 2023-24లో 20 శాతం, 2024-25లో 35 శాతం, 2025-26లో 45 శాతం మేరకు తగ్గించుకోవాలని పేర్కొంది. ఆ స్థానంలో పునరుత్పాదక విద్యుత్‌ను ప్రోత్సహించాలని తెలిపింది. తాజాగా ఇప్పటి వరకు సోలార్‌ ప్యానల్స్‌పై ఇస్తున్న రాయితీల్లో కోత విధిస్తూ కేంద్రం రాష్ట్రాలకు ఉత్తర్వులు పంపింది. సోలార్‌ విద్యుత్‌ ఉపకరణాలపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచుతున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం గహ వినియోగానికి ఒక కిలోవాట్‌ పీక్‌ సోలార్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే రూ.21,320 సబ్సిడీ ఉంది. ఈ నెల 15 నుంచి ఈ సబ్సిడీని రూ. 14,588 కు తగ్గిస్తున్నారు. అలాగే ఐదు కిలోవాట్ల పీక్‌ సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేసుకుంటే ప్రస్తుతం రూ.74,560 సబ్సిడీ ఉంది. దాన్ని రూ.58,352కు తగ్గించారు. 10 కిలోవాట్‌ పీక్‌ సోలార్‌ వ్యవస్థకి ప్రస్తుతం రూ.1,21,160 సబ్సిడీ ఉండగా, దాన్ని రూ.94,822కు తగ్గించారు. అపార్ట్‌మెంట్లకు ప్రస్తుతం కిలోవాట్‌ పీక్‌ సోలార్‌ వ్యవస్థకు రూ.10,660 సబ్సిడీ ఉండగా, దాన్ని రూ.7,294 రూపాయలకు తగ్గించారు. మూడు కిలోవాట్‌ పీక్‌ ప్యానల్స్‌కి సబ్సిడీ రూ.28,680 ఉండగా, దాన్ని రూ.21,882కు కుదించారు. ఈ నిర్ణయాలు సోలార్‌ విద్యుదుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. వినియోగదారులపై ఆర్థికభారం పెరుగుతుంది. గతంలో కరోనా కారణంగా మధ్యలో నిలిచిపోయిన సోలార్‌ ప్రాజెక్టుల నిర్మాణంపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం గతేడాది సోలార్‌ విద్యుత్‌ ఉపకరణాలపై దిగుమతి సుంకం పెంచిన విషయం తెలిసిందే. ఈ తాజా నిర్ణయాల వల్ల దాదాపు 40 గిగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులపై ఆర్ధికభారం పడనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,289.55 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కోసం పంపిణీ సంస్థలు (డిస్కంలు) కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)లు చేసుకున్నాయి. అవికాకుండా మరో 227.34 మెగావాట్ల రూఫ్‌టాప్‌ సోలార్‌ కోసం కూడా పీపీఏలు చేసుకున్నాయి. కరోనా సందర్భంగా ఈ ఒప్పందాల్లోని పలు ప్రాజెక్టులు సగంలో ఆగిపోయాయి. వాటి పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. కేంద్ర నిర్ణయం వల్ల ఇప్పుడు వాటన్నింటిపై ఆర్థికభారం పెరుగుతుంది. దీనితో పీపీఏలను సవరించాలని ఆయా సంస్థలు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ)ని సంప్రదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతిమంగా ఈ కేంద్ర నిర్ణయాల భారం విద్యుత్‌ వినియోగదారులపైనే పడనుంది.
కుట్రపూరితం
గుజరాత్‌ తర్వాత తెలంగాణలోనే సోలార్‌ విద్యుదుత్పత్తి అధికంగా ఉంది. ప్రస్తుతం దాదాపు 4వేల మెగావాట్ల వ్యవస్థాపిత సామర్థ్యం ఉంది. మరో రెండువేల మెగావాట్ల ప్రాజెక్టులు టెండర్‌ దశలో ఉన్నాయి. అవిపూర్తయితే సోలార్‌ విద్యుదుత్పత్తిలో గుజరాత్‌ను అధిగమిస్తాం. కేంద్రం సోలార్‌ విద్యుత్‌కు అడ్డంకులు సష్టించి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నది. మరో రెండు మూడేండ్లలో సోలార్‌పై పూర్తిగా సబ్సిడీ ఎత్తేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రం వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి. పునరుత్పాదక ఇంధన శక్తిలో అతి ముఖ్యమైన సోలార్‌ను ప్రోత్సహించేలా సబ్సిడీని పెంచాలి. జీఎస్టీ, దిగుమతి సుంకాలను వెంటనే తగ్గించాలి.
రెడ్కో చైర్మెన్‌ వై సతీష్‌రెడ్డి కుట్రపూరితం
గుజరాత్‌ తర్వాత తెలంగాణలోనే సోలార్‌ విద్యుదుత్పత్తి అధికంగా ఉంది. ప్రస్తుతం దాదాపు 4వేల మెగావాట్ల వ్యవస్థాపిత సామర్థ్యం ఉంది. మరో రెండువేల మెగావాట్ల ప్రాజెక్టులు టెండర్‌ దశలో ఉన్నాయి. అవిపూర్తయితే సోలార్‌ విద్యుదుత్పత్తిలో గుజరాత్‌ను అధిగమిస్తాం. కేంద్రం సోలార్‌ విద్యుత్‌కు అడ్డంకులు సష్టించి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నది. మరో రెండు మూడేండ్లలో సోలార్‌పై పూర్తిగా సబ్సిడీ ఎత్తేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రం వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి. పునరుత్పాదక ఇంధన శక్తిలో అతి ముఖ్యమైన సోలార్‌ను ప్రోత్సహించేలా సబ్సిడీని పెంచాలి. జీఎస్టీ, దిగుమతి సుంకాలను వెంటనే తగ్గించాలి.