స్పిన్‌కు పడిపోయారు

–  భారత్‌, ఆసీస్‌ మూడో టెస్టు తొలి రోజు
–  తొలి రోజు కదం తొక్కిన కంగారూలు
–  109 పరుగులకే కుప్పకూలిన భారత్‌
–  ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 156/4
టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా కకావికలం కాగా..
మూడో టెస్టులో అది టీమ్‌ ఇండియా వంతైంది!. హోల్కర్‌ పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ స్పిన్‌కు విలవిల్లాడింది. లయాన్‌, మర్ఫీ, కునేమాన్‌ ముప్పేట మాయజాలంతో 109 పరుగులకే కుప్పకూలింది. విరాట్‌ కోహ్లి (22), శుభ్‌మన్‌ గిల్‌ (21) 20 ప్లస్‌ పరుగులే అత్యధికం కావటం గమనార్హం. బదులుగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో దీటుగా సాగుతోంది.
156/4తో తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
నవతెలంగాణ-ఇండోర్‌
స్పిన్‌ ట్రాక్‌ వ్యూహం అడ్డం తిరిగింది. టీమ్‌ ఇండియా రచించిన స్పిన్‌ వ్యూహంలో తనే చిక్కుకుంది. ఇండోర్‌ టెస్టులో 33.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలిన భారత్‌.. తొలి రోజు ఆస్ట్రేలియాకు ఆధిక్యం అప్పగించింది. యువ స్పిన్నర్‌ మాథ్యూ కునేమాన్‌ (5/16) ఐదు వికెట్ల ప్రదర్శనకు తోడు నాథన్‌ లయాన్‌ (3/35) మాయజాలంతో తోడవటంతో రోహిత్‌సేన కుదేలైంది. విరాట్‌ కోహ్లి (22, 52 బంతుల్లో 2 ఫోర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (21, 18 బంతుల్లో 3 ఫోర్లు) మాత్రమే చెప్పుకోదగిన ప్రదర్శన చేశారు. లోయర్‌ ఆర్డర్‌లో కె.ఎస్‌ భరత్‌ (17, 30 బంతుల్లో 1 ఫోర్‌), ఉమేశ్‌ యాదవ్‌ (17, 13 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (12 నాటౌట్‌, 33 బంతుల్లో 1 ఫోర్‌) భారత్‌ను వంద పరుగులు దాటించారు. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజ (60, 147 బంతుల్లో 4 ఫోర్లు) అర్థ సెంచరీతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 156/4 పరుగులతో కొనసాగుతుంది. మార్నస్‌ లబుషేన్‌ (31), స్టీవ్‌ స్మిత్‌ (26) సైతం రాణించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ముందంజలో నిలిచింది.
స్పిన్‌కు విలవిల
సిరీస్‌లో తొలిసారి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా తొలి సెషన్లోనే చేతులెత్తేసింది. స్పిన్‌ స్వర్గధామ పిచ్‌పై భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో మొదలైన పతనం.. ఎక్కడా ఆగలేదు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (12), శుభ్‌మన్‌ గిల్‌ (21) తొలి వికెట్‌కు 27 పరుగులు జోడించారు. గిల్‌ ఓ ఎండ్‌లో ఎడాపెడా బౌండరీలు బాదాడు. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతుందని అనిపించింది. కానీ రోహిత్‌ శర్మ వికెట్‌తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కునేమాన్‌ ఓపెనర్లను ఇద్దరినీ సాగనంపగా.. నాథన్‌ లయాన్‌కు పుజార (1) చిక్కాడు. క్రీజులో కాస్త సౌకర్యవంతంగా కనిపించిన విరాట్‌ కోహ్లి (22)ని మరోసారి టాడ్‌ మర్ఫీ వెనక్కి పంపించాడు. జడేజా (4) డిఆర్‌ఎస్‌తో పెవిలియన్‌కు చేరగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (0) డకౌట్‌గా నిష్క్రమించాడు. లంచ్‌ విరామ సమయానికే 84/7తో భారత్‌ ఆలౌట్‌కు చేరువైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే కథ ముగిసింది. చివర్లో కె.ఎస్‌ భరత్‌ (17), అక్షర్‌ పటేల్‌ (12 నాటౌట్‌), ఉమేశ్‌ యాదవ్‌ (17) వేగంగా ఆడటంతో భారత్‌ వంద పరుగుల మార్క్‌ చేరుకోగలిగింది. ఉమేశ్‌ యాదవ్‌ రెండు సిక్సర్లతో భారత్‌కు మూడెంకల స్కోరు అందించాడు.
ఆసీస్‌ దూకుడు
రెండో సెషన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియాకు సైతం ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న ట్రావిశ్‌ హెడ్‌ (9)ను ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే అవుట్‌ చేసిన జడేజా.. కంగారూ శిబిరంలో గుబులు రేపాడు. కానీ మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజ (60), మార్నస్‌ లబుషేన్‌ (31) ఆసీస్‌ను గట్టెక్కించారు. రెండో వికెట్‌కు విలువైన 96 పరుగులు జోడించిన ఖవాజ, లబుషేన్‌ భారత్‌ను నైరాశ్యంలోకి నెట్టారు. లబుషేన్‌ అవుటైనా.. స్టీవ్‌ స్మిత్‌ (26)తో కలిసి ఖవాజ జోరు కొనసాగించాడు. భారత బౌలర్లలో అశ్విన్‌, జడేజా వికెట్ల వేటలో చెమటోడ్చారు. అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌లకు పెద్దగా పని లేకపోయింది. రవీంద్ర జడేజాకు నాలుగు వికెట్లు పడినా.. అప్పటికే ఆసీస్‌ ఆధిక్యంలోకి ప్రవేశించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ (7 నాటౌట్‌), కామెరూన్‌ గ్రీన్‌ (6 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు.
స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ (స్టంప్డ్‌) అలెక్స్‌ (బి) కునేమాన్‌ 12, గిల్‌ (సి) స్మిత్‌ (బి) కునేమాన్‌ 21, పుజార (బి) లయాన్‌ 1, కోహ్లి (ఎల్బీ) మర్ఫీ 22, జడేజా (సి) కునేమాన్‌ (బి) లయాన్‌ 4, అయ్యర్‌ (బి) కునేమాన్‌ 0, భరత్‌ (ఎల్బీ) లయాన్‌ 17, అక్షర్‌ నాటౌట్‌ 12, అశ్విన్‌ (సి) అలెక్స్‌ (బి) కునేమాన్‌ 3, ఉమేశ్‌ (ఎల్బీ) కునేమాన్‌ 17, సిరాజ్‌ (రనౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు : 0, మొత్తం : (33.2 ఓవర్లలో ఆలౌట్‌) 109.
వికెట్ల పతనం : 1-27, 2-34, 3-36, 4-44, 5-45, 6-70, 7-82, 8-88, 9-108, 10-109.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 5-0-21-0, కామెరూన్‌ గ్రీన్‌ 2-0-14-0, కునేమాన్‌ 9-2-16-5, నాథన్‌ లయాన్‌ 11.2-2-35-3, టాడ్‌ మర్ఫీ 6-1-23-1.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : ట్రావిశ్‌ హెడ్‌ (ఎల్బీ) జడేజా 9, ఉస్మాన్‌ ఖవాజ (సి) గిల్‌ (బి) జడేజా 60, లబుషేన్‌ (బి) జడేజా 31, స్మిత్‌ (సి)భరత్‌ (బి) జడేజా 26, హ్యాండ్స్‌కాంబ్‌ నాటౌట్‌ 7, కామెరూన్‌ గ్రీన్‌ నాటౌట్‌ 6,
ఎక్స్‌ట్రాలు : 17, మొత్తం : (54 ఓవర్లలో 4 వికెట్లకు) 156.
వికెట్ల పతనం : 1-12, 2-108, 3-125, 4-146.
బౌలింగ్‌ : అశ్విన్‌ 16-2-40-0, జడేజా 24-6-63-4, అక్షర్‌ 9-0-29-0, ఉమేశ్‌ 2-0-4-0, సిరాజ్‌ 3-0-7-0.