స్పౌజ్‌ బదిలీలకు అనుమతిచ్చారు… మాకూ ఇవ్వండి

– సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర స్పౌజ్‌ ఫోరం విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఉపాధ్యాయ స్పౌజ్‌ బదిలీలకు అనుమతిచ్చినందుకు సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి స్పౌజ్‌ ఫోరం కృతజ్ఞతలు తెలిపింది. అదే తరహాలో మాకు చేయాలంటూ 13 జిల్లాల ఎస్‌జీటీ, ఎల్‌పీ, పీఈటీ ఉపాధ్యాయులు విజ్జప్తి చేశారు. ఈమేరకు హైదరాబాద్‌ సోమాజి గూడలోని ప్రెస్‌క్లబ్‌లో స్పౌజ్‌ ఫోరం అధ్యక్షులు వివేక్‌, నాయకులు విజయలక్ష్మి, మాధవి, మమతా, షబానాబేగం తదితరులు విలే కర్లతో మాట్లాడారు. సాంకేతిక కారణాలతో 13 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతులకు బదిలీలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చొరవ ఫలితంగా ఉపాధ్యాయ దంపతులకు బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయని తెలిపారు. ఉద్యోగులైన దంపతులు ఒకే చోట ఉంటే మంచి ఫలితాలు సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
దంపతులైన ఉద్యోగులు ఒకే క్యాడర్‌ పనిచేసేందుకు వీలుగా మెమో 1655 తీసుకొచ్చినన విషయాన్ని గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రిని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరామనీ, అందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. 13 జిల్లాల్లో స్పౌజ్‌ బదిలీల కోసం 2001 కుటుంబాలు గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నామనీ, ప్రభుత్వం కేవలం 615 మంది స్కూల్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌లో మాత్రమే అనుమతించారని ఇచ్చారని గుర్తు చేశారు. ఎస్జీటీ క్యాడర్‌ పోస్టులు ప్రతి జిల్లాలోనూ ఖాళీలున్నాయనీ, ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్ల ప్రక్రియ ద్వారా ఎస్జీటీ పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడుతున్నాయని స్పష్టం చేశారు. ఎస్జీటీ, భాషా పండితులు, పీఈటీ స్పౌజ్‌ బదిలీలకు అనుమతించి న్యాయం చేయాలని కోరారు.