హైదరాబాద్‌లో సీరం ఇన్‌ స్టిట్యూట్‌

– సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కరోనా సమయంలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను అందించి పేరుగాంచిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ అంటువ్యాధులు, మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. నగరంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రాంగణం నుంచి ఇది సేవలందించనున్నది. సీరం ఇన్‌ స్టిట్యూట్‌ ప్రపంచంలోనే వ్యాక్సిన్ల తయారీలో అగ్రగామి. ఈ సంస్థ పోలియో, డిఫ్తీరియా, టెటానస్‌, పెర్టస్సిస్‌, హిబ్‌, బీసీడీ, ఆర్‌-హెపటైటీస్‌ బి, మీజిల్స్‌, రుబెల్లా, కోవిడ్‌-19 తదితర వ్యాధులకు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నది. సీరం వ్యాక్సిన్లను దాదాపు 170 దేశాలు తమ జాతీయ ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమంలో ఉపయోగిస్తుండటం గమనార్హం. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సీరం సంస్థ సీఈవో పూనవాలాతో సమావేశమై చర్చించారు. దీని ఫలితంగా ఇప్పటికే ప్రపంచ వ్యాక్సిన్ల రాజధానిగా పేరుగాంచిన హైదరాబాద్‌లో సెంటర్‌ ఆప్‌ ఎక్సలెన్స్‌ను నెలకొల్పేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పూనవాలా మాట్లాడుతూ ప్రజారోగ్య విద్య, అంటువ్యాధుల పర్యవేక్షణ, స్థానిక ఆరోగ్య సంరక్షణలతో సమన్వయం, మహమ్మారితో ప్రభావితులైన కుటుంబాలకు సరైన సమాచారమివ్వడం, అంతిమంగా రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడం లక్ష్యంగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రొఫెసర్‌ శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ మహమ్మారులను ఎదుర్కొనేందుకు తగిన రీతిలో సిద్ధపడేందుకు ఈ సెంటర్‌ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.