హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ

హైదరాబాద్‌: 12వ హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ శుక్రవారం ఘనంగా ఆరంభమైంది. నాలుగు రోజుల పాటు జరుగనున్న మెగా ఈవెంట్‌లో దేశవ్యాప్తంగా 337 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. వివిధ ఏజ్‌ విభాగాల్లో నిర్వహించే ఈ టోర్నీలో తొలిసారి మహిళల సింగిల్స్‌ ఓపెన్‌ విభాగాన్ని ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ సీడెడ్‌ ఆటగాళ్లు సైతం పోటీపుడుతున్న ఈ టోర్నమెంట్‌ను శుక్రవారం ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ ఐజీపీ ఎస్‌. చంద్రశేఖర్‌ రెడ్డి ప్రారంభించారు. ఆరంభ కార్యక్రమంలో హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎల్‌. శ్రీనివాస్‌, కో ఆర్డినేటర్‌ హరికష్ణరెడ్డి, ఎఫ్‌ఎంసీ అధ్యక్షుడు వెంకట ప్రసాద రెడ్డి, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శేషు నారాయణ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పోటీపడుతున్న 337 మందికి హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఓటీఏ) ఉచిత భోజన, వసతి సదుపాయం ఏర్పాటు చేసింది.