హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

– కారును ఢ కొట్టిన డీసీఎం
– నలుగురు మృతి
నవతెలంగాణ-మహేశ్వరం
హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారి తుమ్మ లూరు గేట్‌ సమీపంలో (మ్యాక్‌) శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్విప్ట్‌ కారును డీసీఎం ఢకొీట్ట డంతో నలు గురు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై జరిగింది. సీఐ మధుసూదన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన రామస్వామి(36), యాదయ్య(35), శ్రీనివాసులు(35), కేశవులు(33) మరికొందరితో కలిసి వివిధ బృందాలుగా ఏర్పడి శుభకార్యాల్లో వంటలు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో వీరు ఓ శుభకార్యంలో వంట చేసేందుకు గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. తిరిగి కారులో స్వగ్రామానికి వెళ్తుండగా శుక్రవారం తెల్లవారు జామున వీరి కారును తుమ్ము లూరు గేట్‌ వద్ద డీసీఎం ఢకొీట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎం డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన డీసీఎం డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో తుక్కుగూడ నుంచి మహేశ్వరం గేటు వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.