– ఆన్‌లైన్‌లో సమర్పణకు గడువు 16
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఇప్పటి వరకు 1,65,513 దరఖాస్తులొచ్చాయి. ఈ మేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు 1,74,734 మంది ఫీజు చెల్లించారని తెలిపారు. వారిలో పేపర్-1కు 52,329 మంది, పేపర్-2కు 7,960మంది, రెండింటికీ కలిపి 1,05,224మంది కలిపి 1,65,513మంది దరఖాస్తు చేశారని వివరిం చారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఈనెల 16 వరకు ఉన్న విషయం తెలిసిందే. వచ్చేనెల 15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 టెట్ రాతపరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ నిర్వహిస్తారు. ఇతర వివరాలకు https://tstet.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.