– రూ.743 కోట్ల పరిహారం చెల్లింపు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా ఆయా కోర్టులు, వినియోగదారుల ఫోరాల్లో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌తో 10,35,520 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా రూ.743 కోట్లను నష్ట పరిహారం కింద చెల్లించారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పిలుపు మేరకు శనివారం రాష్ట్రంలోని అన్ని కోర్టులు, వినియోగదారుల ఫోరాల్లో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈసందర్భంగా రకరకాల కేసులపై ఇరుపార్టీల మధ్య విచారణతోపాటు సమన్వయం చేశారు. జిల్లాలతోపాటు హైకోర్టులో పరిష్కారం చేసిన కేసుల్లో 5,81,611 ప్రిలిటిగేషన్ కేసులు, 4,53,909 పెండింగ్ కేసులను పరిష్కరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ సుజోరు పాల్, చైర్మెన్ జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి అన్ని కోర్టులతో సమన్వయం చేశారు. ఈ మేరకు లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి సిహెచ్ పంచాక్షరి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.