– చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికుమార్
నవతెలంగాణ-వలిగొండ
ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న చేనేత పడుగు పేకల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికుమార్ అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించనున్నట్టు చెప్పారు. చేనేత కార్మికుల అధ్యయన యాత్రలో భాగంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత పరిశ్రమను, చేనేత సహకార సంఘాల మనుగడ లేకుండా కార్పొరేటీకరణ పేరుతో నిర్వీర్యం చేశాయన్నారు. నేడు నేతన్నలు పనిలేక, ప్రభుత్వం ఆదుకోకపోవడంతో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ ఆకలిచావులకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల ఉపాధి, సంక్షేమం కోసం అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని, దానికి రూ.1000కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి చేనేత కార్మికునికీ రూ.5లక్షల పెట్టుబడి సహాయం అందించాలని కోరారు. త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని తిరిగి కొనసాగించాలని కోరారు. ‘చేనేత పడుగు పేకల’ ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయడా నికి రాష్ట్రవ్యాప్తంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శి ముషం నరహరి సారథ్యంలో చేనేత కార్మికుల అధ్యయన యాత్ర కొనసాగుతోందన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు గర్దాసు నర్సింహ, పారుపల్లి నర్సింహ, నాయకులు దొంత శంకరయ్య, రాపోలు ఆంజనేయులు, బోడ ఈశ్వర్, ఆటిపాముల కుమార్ తదితరులు పాల్గొన్నారు.