– హార్దిక్ కోసం ముంబయి ఇండియన్స్ పెట్టిన డబ్బు
– పాండ్య బదిలీ కోసం గుజరాత్ టైటాన్స్‌కు చెల్లింపు
నవతెలంగాణ-ముంబయి
రూ.100 కోట్లు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కోసం ఐపీఎల్ ప్రాంఛైజీ ముంబయి ఇండియన్స్ వెచ్చించిన మొత్తం ఇది!. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు సీజన్లు గుజరాత్ టైటాన్స్‌ను ఫైనల్స్‌కు నడిపించిన హార్దిక్ పాండ్య.. 2024 ఐపీఎల్ ముంగిట మాతృ ప్రాంఛైజీ ముంబయి ఇండియన్స్ శిబిరానికి చేరుకున్నాడు. గాయంతో కెరీర్ ప్రమాదంలో పడిన సమయంలో గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యను రూ.15 కోట్లను ఎంచుకుని, కెప్టెన్సీ బాధ్యతలు సైతం అప్పగించింది. క్రికెట్ కెరీర్లో ఎన్నడూ నాయకత్వం వహించని హార్దిక్ పాండ్య.. గుజరాత్ టైటాన్స్‌ను ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపి ఏకంగా జాతీయ జట్టు పగ్గాలపై కన్నేశాడు. 2023 ఐపీఎల్ ఫైనల్లోనూ టైటిల్ అందుకునేందుకు ఆఖరు బంతి వరకు పోరాడిన గుజరాత్ టైటాన్స్.. చెన్నై సూపర్‌కింగ్స్‌కు తలొగ్గింది. ఇటు ఆటగాడిగా, అటు నాయకుడిగా కొత్త ఇన్నింగ్స్‌ను అందించిన గుజరాత్ టైటాన్స్‌ను హార్దిక్ పాండ్య వీడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, హార్దిక్ పాండ్యను తిరిగి తెచ్చుకునేందుకు ముంబయి ఇండియన్స్ ఖర్చు చేసిన మొత్తం చూసి క్రికెట్ వర్గాలతో పాటు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ ప్రాంఛైజీల శైలి పూర్తి భిన్నం. ఐపీఎల్ ప్రాంఛైజీ కోసం సీవీసీ క్యాపిటల్స్ రూ.5625 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇప్పటివరకు రెండు సీజన్లలో పోటీపడింది. రెండు సార్లు టైటిల్ పోరుకు చేరుకుని ఎదురులేని ట్రాక్ రికార్డు సాధించింది. మరోవైపు భారత దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం నేరుగా ముంబయి ఇండియన్స్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్న ముంబయి ఇండియన్స్.. గ్లోబల్ టీ20 లీగ్‌ల్లో తమదైన మార్క్ చూపించేందుకు ఎంతవరకైనా వెళ్తుంది. అందుకే, ఆల్‌రౌండర్‌గా, నాయకుడిగా తనేంటో నిరూపించుకున్న హార్దిక్ పాండ్య కోసం కనీవినీ ఎరుగని రీతిలో రూ.100 కోట్లు వెచ్చించింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. హార్దిక్ పాండ్యను వదులుకోవటంతో తొలుత గుజరాత్ టైటాన్స్‌కు వేలంలో రూ.15 కోట్లు అందుబాటులోకి వచ్చాయి. అతడి వార్షిక వేతనం ముంబయి ఇండియన్స్ ఖాతాలోకి వెళ్లింది. కెప్టెన్‌ను వదులుకున్నందుకు గుజరాత్ టైటాన్స్ రూ.100 కోట్ల ప్లేయర్ ట్రాన్ఫర్ ఫీజు వసూలు చేసింది. ఇందులో 50 శాతం, అంటే రూ.50 కోట్లు నేరుగా హార్దిక్ పాండ్య అందుకుంటాడు. ఈ ఒప్పందం జరిగిన సమయంలో ఆటగాడి బదిలీ ఫీజు కింద ముంబయి ఇండియన్స్ మరో రూ.15 కోట్ల వరకు చెల్లించిందనే వార్తలు వచ్చాయి. కానీ వాస్తవ లెక్కల ప్రకారం రూ.100 కోట్ల ఒప్పందం అని తెలుస్తోంది. అందుకే, గుజరాత్ టైటాన్స్ తమ సారథిని వదులుకునేందుకు సిద్ధపడగా.. హార్దిక్ సైతం అంబానీ ప్రాంఛైజీలో కెప్టెన్సీ, డబ్బు వస్తుండటంతో సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో హార్దిక్ పాండ్యను తెచ్చుకున్నా.. ముంబయి ఇండియన్స్‌కు ఏదీ కలిసి రావటం లేదు. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, జశ్‌ప్రీత్ బుమ్రాలు హార్దిక్‌ను కెప్టెన్‌గా చేయటం పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాల్లో ఆ ఇద్దరు ఆటగాళ్లు మనసులో మాట పరోక్షంగా చెప్పారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించటంతో అతడి అభిమానులు ముంబయి ఇండియన్స్ యాజమాన్యంపై భగ్గుమన్నారు. జెర్సీలు కాల్చుతూ నిరసన తెలపటంతో పాటు సోషల్ మీడియాలో ఆ ప్రాంఛైజీ ఖాతాలను అన్‌ఫాలో అయ్యారు. భావోద్వేగాలను తక్కువ అంచనా వేసిన ముంబయి ఇండియన్స్..ఆ తర్వాత అభిమానులను బుజ్జగించే పనిలో పడినా అప్పటికే పూడ్చలేని నష్టం జరిగిపోయింది. హార్దిక్ కోసం రూ.100 కోట్లు చెల్లించినట్లు వార్తలు వచ్చినా… గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ప్లేయర్ ట్రాన్ఫర్ ఫీజు మొత్తం విలువ కేవలం బీసీసీఐ మాత్రమే తెలుసని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి.