రూ. 100 కోట్లు తరలించాలి…

రూ. 100 కోట్లు తరలించాలి...– మధ్యప్రదేశ్‌లో కేంద్రమంత్రి కుమారుడి వీడియో వైరల్‌
– మనీలాండరింగ్‌ కేసు నమోదు చేయాలి: కాంగ్రెస్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర వ్యవసాయ మంత్రి, మధ్యప్రదేశ్‌ బీజేపీ నాయకుడు నరేంద్ర సింగ్‌ తోమర్‌ కుమారుడు దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ కోట్లాది లావాదేవీలపై చర్చిస్తున్నట్లు ఆరోపించిన వీడియో రాష్ట్రంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పెద్ద వివాదానికి దారితీసింది. దేవేంద్ర తోమర్‌ చేసిన ఫిర్యాదు ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తిపై ఈ కేసు నమోదైంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది తన ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేసిందని ఆయన ఆరోపించారు. ఆ వీడియో క్లిప్‌లో దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ ఒక వ్యక్తితో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుతున్నట్లు, రూ.100 కోట్ల విలువైన నిధులను ”తరలించడం” గురించి చర్చిస్తున్నట్టు కనిపిస్తుంది. మరో కాల్‌ రికార్డింగ్‌లో ”తన రూ.18 కోట్లు” నాలుగు వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయని ఒక వ్యక్తి తోమర్‌కి చెప్పడం వినిపిస్తుంది.
మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 17న జరిగే ఎన్నికలకు నరేంద్ర సింగ్‌ తోమర్‌ దిమాని అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్న సందర్భంగా ముందుగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ తన ఫిర్యాదులో ”నేను కోట్ల విలువైన లావాదేవీలు నిర్వహించినట్టు తప్పుడు ప్రచారంతో వైరల్‌ వీడియో బయటపడింది. ఈ కల్పిత వీడియో నాపై దుష్ప్రచారం, ప్రతికూల అభిప్రాయాన్ని సృష్టించే కుట్రలో భాగం. నకిలీ వీడియో క్లిప్‌లు నా పబ్లిక్‌ ఇమేజ్‌, ప్రతిష్టను దెబ్బతీసే దురుద్దేశంతో వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేయబడుతున్నాయి” అని పేర్కొన్నారు. తనకు గానీ, తన కుటుంబం నుంచి గానీ, సన్నిహితుల నుంచి గానీ ఎవరికీ వారి బ్యాంకు ఖాతాల్లో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రాలేదని, ఆ ఆరోపణలు అబద్ధమని, కల్పితమని అన్నారు. కుట్రపై క్షుణ్ణంగా విచారణ జరిపి, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కూడా ఆయన కోరారు. గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కేంద్రమంత్రి నరేంద్ర తోమర్‌ను బర్తరఫ్‌ చేయాలి
వీడియోపై న్యాయ విచారణకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌, దర్యాప్తు పూర్తయ్యే వరకు కేంద్రమంత్రి నరేంద్ర తోమర్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. ”నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఢిల్లీలోనే కాదు, మధ్యప్రదేశ్‌లో కూడా శక్తివంతమైన వ్యక్తి. ఆయన కుమారుడిని అరెస్టు చేసే వరకు స్వేచ్ఛగా, న్యాయమైన విచారణ సాధ్యం కాదు” అని కాంగ్రెస్‌కు చెందిన సుప్రియా శ్రీనాట్‌ అన్నారు. మనీలాండరింగ్‌ కేసు నమోదు చేయాలని కూడా కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ మీడియా సలహాదారు పీయూష్‌ బాబేలే ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), ఆదాయపన్ను శాఖ తమ ప్రామాణికతను ధ్రువీకరించాలని కోరారు.