న్యూఢిల్లీ: మణిపూర్‌లో జాతుల ఘర్షణలు చెలరేగి శనివారం నాటికి నూట ఒక్క రోజులు కావస్తోంది. అప్పటి నుంచి ఇంటర్నెట్ సేవలను బిజెపి ప్రభుత్వం నిలిపివేసింది. నేటికి వంద రోజులైనా నిషేధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంటర్నెట్ సేవల పాక్షిక పునరుద్ధరణ కోసం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని శనివారం ఆదేశించింది. పాక్షిక పునరుద్ధరణ రాష్ట్ర జనాభాలో చాలా తక్కువ మంది అవసరాలను మాత్రమే తీరుస్తుంది.
ఇంటర్నెట్ షట్‌డౌన్‌ను నిరవధికంగా కొనసాగించడాన్ని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఖండించింది. ”మణిపూర్ పౌరులు తమ ప్రాథమిక మానవ హక్కులను కోల్పోతున్నారు” అని ఫౌండేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. రీసెర్చ్ అండ్ అడ్వకేసీ ఆర్గనైజేషన్ ఈ నిరవధిక షట్‌డౌన్ పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు తాము విన్నదానిని స్వతంత్రంగా నిర్ధారించుకునే అవకాశం లేకుండాపోతుందని తెలిపింది.
మణిపూర్ పౌరులు వారి ప్రాథమిక మానవ హక్కులను ఎలా కోల్పోతున్నారో చూశాక మనసు చివుక్కుమందని ఫౌండేషన్ పేర్కొంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని, దీనికి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది.
మే 3న విధించిన ఇంటర్నెట్ యాక్సెస్ సస్పెన్షన్‌ను విధించింది. జులై 25న బ్రాడ్‌బ్యాండ్ సేవలను కొంతమేర సడలించింది. అయితే ఈ బ్రాడ్‌బ్యాండ్ (ఇంటర్నెట్ లీజుకు తీసుకున్న లైన్ మరియు ఇంటికి ఫైబర్) ను వినియోగిస్తున్నది కేవలం 3 శాతం మాత్రమే. అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఇలా పేర్కొంది. ఇంటర్నెట్ సేవలపై ఏవైనా ఆంక్షలు విధిస్తే పదిహేను రోజులకు మించి ఉండకూడదని చట్ట నిబంధనలు చెబుతున్న విషయాన్ని గుర్తు చేసింది.
ఇంటర్నెట్ సేవల పాక్షిక పునరుద్ధరణకు కూడా ప్రభుత్వం అనేక షరతులు పెట్టింది. మొబైల్ డేటా సేవలు నిలిపివేయబడ్డాయి. బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు స్థానిక స్థాయిలో సోషల్ మీడియా వెబ్‌సైట్ల నిలిపివేతను కొనసాగించింది.
మణిపూర్ పౌరుల్లో అత్యధికులకు ఇంటర్నెట్ సేవలు గత వంద రోజులుగా నిలిచిపోవడంతో ఆరోగ్య సంరక్షణ, విద్య, బ్యాంకింగ్ సేవలు స్తంభించిపోయాయి. జీవనోపాది దెబ్బతింది. అంతిమంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితి ఏర్పడింది. ఇంటర్నెట్ షట్‌డౌన్ ప్రభావం ఉపాధిపై ఎలా ఉంటుందో హ్యూమన్ రైట్స్ వాచ్, ఐఫ్‌ఎఫ్ సంయుక్త నివేదిక వెల్లడించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకాలపై ఆధారపడిన కార్మికులు, ఇంటర్నెట్ సస్పెన్షన్ కారణంగా ప్రభుత్వ యాప్‌లో తమ హాజరును గుర్తించలేక వేతనాలను కోల్పోయిన ఉపాధి కూలీల పరిస్థితిని ఆ నివేదిక బయటపెట్టింది. అంతేకాదు, ఇంటర్నెట్ షట్‌డౌన్ వల్ల వాస్తవిక సమాచారం తెలుసుకునే అవకాశం ప్రజలకు లేకుండా పోయింది. మణిపూర్ వెలుపల ఉన్న ప్రజలకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియక తీవ్ర ఆందోళనతో ఉన్నారు. శాంతిభద్రతల సమస్యలను నివారించడంలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఇంటర్నెట్ షట్‌డౌన్‌ను ప్రభుత్వం ఇలా నిరవధికంగా కొనసాగించడం దారుణమని పలువురు నిపుణులు పేర్కొన్నారు.