ఇరాన్‌లో టెర్రరిస్టు దాడి ..100 మంది మృతి

Terrorist attack in Iran ..100 people diedఇరాన్‌ లోని దక్షిణ మధ్య నగరమైన కెర్మన్‌ లో బుధవారంనాడు టెర్రరిస్టు దాడి జరిగింది. ఇరాన్‌ జనరల్‌ కాస్సెమ్‌ సొలైమనీ నాలుగవ వర్దంతి సందర్బంగా ఏర్పాటైన సంస్మరణ సభలో రెండు శక్తివంతమైన బాంబులను పేల్చారు. ఈ బాంబు దాడిలో కనీసం 100మంది మరణించారు. 200మంది గాయపడ్డారు. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్స్ప్‌ మాజీ కమాండర్‌ సమాధికి సమీపంలో ఈ బాంబులను రిమోట్‌ తో పేల్చటం జరిగింది. గాయపడిన వారిని వేగంగా ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ వివిధ ఆసుపత్రులకు తరలించాయని కెర్మన్‌ రెడ్‌ క్రెస్సెంట్‌ హుమనిటేరియన్‌ గ్రూపు అధినేత రెజా ఫల్లా ఇరానియన్‌ టెలివిజన్‌ కి చెప్పడని అల్‌ జజీరా పేర్కొంది. ఇరాన్‌ ప్రజలకు అత్యంత పీతిపాత్రుడైన సొలైమనీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశంతో 2020 జనవరి 3వ తేదీనాడు ఇరాన్‌ రాజధాని బాగ్దాద్‌ లో ఒక అమెరికా డ్రోన్‌ దాడితో హత్య చేయటం జరిగింది. ఇరాకీ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా సైనిక దళాలపైన దాడిచేయటానికి ప్రణాళిక రచిస్తున్నాడన్న గూఢచార నివేదిక ఆధారంగా తాను సొలైమనీని హతమార్చ టానికి ఆదేశించానని ట్రంప్‌ ఆ తరువాత ప్రకటించాడు. లెబనాన్‌ లో ఒక ప్రముఖ హమస్‌ నాయకుడైన సలే అల్‌-అరౌరిని ఒక డ్రోన్‌ దాడిలో హత్యకు గురైన తరువాత రోజు కెర్మన్‌ లో ఈ బాంబు దాడి జరిగింది. ఈ దాడి ఇజ్రాయిలీ జియొనిస్టు ఆక్రమణదారులతో తలపడటానికి మరింత స్పూర్తిని ప్రజ్వలింప జేస్తుందని ఇరాన్‌ ప్రకటించింది. 15నిముషాల తేడాతో రెండు పేలుళ్ళు సంభవించాయి. మొదటి పేలుడు సొలైమని సమాధి గల కెర్మన్‌ లోని గొల్జార్‌ శ్మశాన వాటికకు 700మీటర్ల దూరంలో పేలిందని, రెండవ పేలుడు ఒక కిలోమీటర్‌ దూరంలో పేలిందని గార్డియన్‌ పత్రిక రాసింది. ఈ శ్మశాన వాటికకు ‘అమరుల తోట’ అని కూడా పేరుంది. ఇక్కడ దాదాపు 1000మంది అమరులను ఖననం చేశారు. అమెరికా, పశ్చిమ దేశాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ‘ప్రతిఘటన అక్షం’ మద్దతుదారులకు ఈ శ్మశాన వాటిక యాత్రాస్థలంగా మారింది. ఈ దాడిలో సొలైమని సమాధి దెబ్బతినలేదని విడియో పుటేజీలో స్పష్టంగా తెలుస్తోంది. ఈ హేయమైన టెర్రరిస్టు దాడి వెనుక ఇజ్రాయిలీ గూఢచార సంస్థ మొస్సాద్‌ ఉన్నట్టు ఇరాన్‌ అనుమానిస్తోంది.