– డజన్ల సంఖ్యలో క్షతగాత్రులు
ఢాకా : బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాపై తలెత్తిన నిరసనలు, ఆందోళనలు విస్తృత ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా రూపుదాల్చాయి. ప్రధాని హసీనా ప్రభుత్వం గద్దె దిగాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తలెత్తిన హింసాకాండలో 100మందికి పైగా మరణించగా, డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. ఇటీవలి వారాల్లో 11వేల మందికి పైగా అరెస్టు చేశారు. వేలాదిగా వున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను, గ్రెనెడ్లను ప్రయోగించారు. రాజధాని ఢాకా, ఉత్తరప్రాంత జిల్లాల్లో ఆదివారం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే సమాచార సంబంధాలపై నిషేధం అమల్లో వుంది. ఆదివారం సాయంత్రం నుంచి కర్ఫ్యూను కూడా విధించారు. నిరవధికంగా ఈ కర్ఫ్యూ అమల్లో వుంటుందని తెలిపారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు సాధారణ శలవు దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రజా భద్రతకు హామీ కల్పించే నిమిత్తం ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిస్థితులు చాలా సున్నితంగా, ప్రమాదకరంగా వున్నాయని మీడియా వార్తలు పేర్కొన్నాయి. ప్రభుత్వం గద్దె దిగేవరకు తాము ఆందోళనలు విరమించేది లేదని విద్యార్ధులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రజలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారని, కొన్ని చోట్ల పాలక అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని మీడియా వార్తలు పేర్కొన్నాయి. సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆందోళనకారులు పిలుపిచ్చారు. పన్నులు, బిల్లులేవీ చెల్లించవద్దని ప్రజలను కోరారు. ఆందోళనలు, హింస ఉధృతమవడంతో రిజర్వేషన్ కోటాను 5 శాతానికి తగ్గిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.