నవతెలంగాణ – సిద్దిపేట
సిద్ధిపేట జిల్లా వైద్య రంగంలో రోజు రోజుకు ముందుకు దూసుకుపోతున్నది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలతో పాటు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు కావడంతో వైద్య రంగంలో ఎంతో పురోగతి సాధించింది. సిద్ధిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు 2023–2024 విద్యా సంవత్సరానికి గాను ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ 100 సీట్లను మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సిద్ధిపేట జిల్లాలో 2021–2022 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం 100 మంది నర్సింగ్ విద్యార్థులు, 2022–2023 విద్యా సంవత్సరానికి 100 మంది నర్సింగ్ విద్యార్థులు అడ్మిషన్ తీసుకుని ప్రస్తుతం మొత్తం 200 మంది నర్సింగ్ విద్యార్థులు నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ సీట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కోటాలో సీట్లు మంజూరు కోసం కళాశాల యాజమాన్యం దరఖాస్తు చేయగా ఈ నెల 8వ, 9న రెండు రోజులు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అధికారులు సిద్ధిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన వసతి సదుపాయాలు, నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయా ? లేవా ? అనే అంశాలను తనిఖీ చేశారు. ద్విసభ్య అధికారులతో కూడిన బృందం నర్సింగ్ విద్యార్థుల థియరీ క్లాసులతో పాటు, ప్రాక్టికల్స్ చేయడానికి అవసరమైన కనీస సౌకర్యాలు, సదుపాయాలపై నాసర్‌పూర అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి , వసతులపై ఆరా తీసి సమర్పించిన నివేదిక ఆధారంగా సిద్ధిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ 100 సీట్లను మంజూరు చేసింది. ప్రత్యేకించి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రత్యేక చొరవ, కృషితో సిద్దిపేటలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు కావడంతో నర్సింగ్ విద్యను అభ్యసించే వారికి ఎంతో ఊరట లబించినట్లు అయ్యింది.
– రూ.50 కోట్లతో శాశ్వత భవన నిర్మాణం…
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు కావడం , రూ.50 కోట్ల వ్యయంతో సుమారు 3 ఏకరాల విస్తీర్ణంలో ఆరు ఫ్లోర్లతో శాశ్వత భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ యేడు జూన్ వరకు నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేనున్నట్లు నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సునీతారెడ్డి తెలిపారు.