నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకం అమలవుతున్న గ్రామపంచాయతీలలో వంద శాతం సామాజిక తనిఖీలు పూర్తి చేసినట్టు సామాజిక తనిఖీ సంస్థ ( ఎస్‌ఎస్‌ఏఏటీ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సామాజిక తనిఖీ సంస్థ రాష్ట్రంలో 540 మండలాల అమలవుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకంలో భాగంగా చేపట్టిన పనులను మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లో సామాజిక తనిఖీలు జరిగాయని తెలిపారు. ఈ తనిఖీల్లో 2022-23 ఏడాదిలో చేపట్టిన అన్ని పనులను, గత ఏడాదిలో చివరలో ఉన్న పనులను క్షేత్ర స్థాయిలో పూర్తిగా పరిశీలించినట్టు తెలిపింది. ఈ తనిఖీ ప్రక్రియలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో చేపట్టిన ఉపాధిహామీ పనుల్లో పాల్గొన్న కూలీలకు చెల్లించిన వేతనాలు, లబ్ధి పొందిన ప్రతి జాబు కార్డు దారుని సామాజిక తనిఖీ బృందం ఇంటింటి సందర్శనలో భాగంగా స్వయంగా కలిసి పథకంద్వారా వారు పొందిన లబ్దిని తెలుసుకోవటంతో పాటు చేపట్టిన పనులను కూడా పరిశీలన చేసినట్టు తెలిపింది. ప్రతి మండలంలో ఇట్టి ప్రక్రియకు కనీసం 10 నుంచి 15 రోజుల పాటు కూలీలు, ప్రజలందరి సహకారంతో గ్రామ సభల్లో సామాజిక తనిఖీ నివేదికతో పాటు అవగాహన కల్పించి ఆ పై మండల స్థాయిలో ప్రజావేదిక నిర్వహించి పూర్తి చేసినట్టు పేర్కొన్నది. కోవిడ్-19 తరువాత ఎదురైన వివిధ రకాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సామాజిక తనిఖీ ప్రక్రియకు ఆటంకం లేకుండా అమలు సంస్థలైన గ్రామపంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు ఇతర అనుబంధ సంస్థల సహకారంతో వంద శాతం గ్రామాల్లో సామాజిక తనిఖి ప్రక్రియను పూర్తి చేసినట్టు తెలిపింది.