100 పరీక్ష

– అశ్విన్‌, బెయిర్‌స్టో కెరీర్‌ వందో టెస్టు
– ధర్మశాలలో మైలురాయి మ్యాచ్‌కు సిద్ధం
ఏ క్రికెటర్‌కు అయినా 100 టెస్టులు అత్యంత ప్రత్యేకం. జాతీయ జట్టు తరఫున ఓ టెస్టులో బరిలోకి దిగితే చాలు అనుకుని మొదలైన ప్రయాణం వందకు చేరుకుంటే అదే అద్భుతం. భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో ఇప్పుడు ఈ మైలురాయి టెస్టుకు సిద్ధమయ్యారు. గురువారం నుంచి ఆరంభం కానున్న ధర్మశాల టెస్టులో అశ్విన్‌, బెయిర్‌స్టో కెరీర్‌ వందో టెస్టు మ్యాచ్‌ ఆడనున్నారు.

స్వదేశీ ‘చాంపియన్‌’
చెన్నై వీధుల్లో టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌లో ‘సొడుకు’ బంతితో మాయజాలం చేసిన కుర్రాడు.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఆ మ్యాజిక్‌ చూపిస్తాడని, 21వ శతాబ్దపు మాయావీగా నిలుస్తాడని ఎవరు ఊహించారు?!. 37 ఏండ్ల రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌గా భారత్‌కు 99 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. ధర్మశాల టెస్టులో కెరీర్‌ వందో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఉపఖండంలో మాయగాళ్లకు కొదవలేదు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో మిస్టరీ మాయ.. ఎంతోకాలం నిలువదు. ఎప్పటికప్పుడు సరికొత్త అస్త్రాలను సిద్ధం చేసుకోవాలి. ఆధునిక టెస్టు క్రికెట్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆ సవాల్‌కు ఎదురొడ్డి నిలిచాడు. 99 టెస్టుల్లో 507 వికెట్టు పడగొట్టాడు. టెస్టు కెరీర్‌లో 8 పర్యాయాలు పది వికెట్ల ప్రదర్శన, 35 సార్లు 5 వికెట్ల ప్రదర్శన సహా 24 ఇన్నింగ్స్‌ల్లో 4 వికెట్లు కూల్చాడు. మ్యాచ్‌ విన్నర్‌గా పేరొందినా.. అశ్విన్‌ను ఎక్కువగా ‘స్వదేశీ చాంపియన్‌’గానే చూశారు. అందుకు కారణం లేక పోలేదు. స్వదేశంలో అనిల్‌ కుంబ్లే, హర్బజన్‌ సింగ్‌ కంటే ఎక్కువ వికెట్లు అశ్విన్‌ పడగొట్టాడు. స్వదేశీ టెస్టుల్లో అశ్విన్‌ ఏకంగా 354 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలలో 70 టెస్టు వికెట్లు పడగొట్టాడు. 2011లో ఢిల్లీలో వెస్టిండీస్‌పై టెస్టు అరంగ్రేటం చేసిన అశ్విన్‌.. నిజానికి ఎప్పుడో వంద టెస్టుల క్లబ్‌లో చేరాల్సింది. విదేశీ టెస్టుల్లో అశ్విన్‌కు ఎక్కువగా అవకాశాలు దక్కలేదు. అయినా, అవకాశం దొరికిన ప్పుడు ప్రత్యర్థిని వణికించాడు. బ్యాటర్‌పై మానసికంగా పైచేయి సాధించేందుకు అశ్విన్‌ వ్యూహా త్మక ఎత్తుగడలు వేయటం లో దిట్ట. స్టీవ్‌ స్మిత్‌, జో రూట్‌లపై అశ్విన్‌ వినూత్న ఎత్తుగడలతో పైచేయి సాధించాడు. మహా మాయగాడు అశ్విన్‌లో ఓ నాణ్యమైన బ్యాటర్‌ దాగి ఉన్నాడు. 99 టెస్టుల్లో బ్యాట్‌తో అశ్విన్‌ మెప్పించాడు. 26.47 సగటుతో 3309 పరుగులు చేశాడు. ఐదు సెంచరీలు, 14 అర్థ సెంచరీలు అశ్విన్‌ ఖాతాలో ఉన్నాయి. ధర్మశాలలో మైలురాయి మ్యాచ్‌ కు సిద్ధమవుతున్న అశ్విన్‌..2018 ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టు, 2017 బెంగళూర్‌ టెస్టు మ్యాచులను తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనలుగా తెలిపాడు.

అనుకోకుండా ‘వంద’!
జానీ బెయిర్‌స్టో. ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌. ఇంగ్లాండ్‌ జట్టులో పరుగుల వేటలో నమ్మకమైన ఆటగాడు జో రూట్‌. పరుగుల వేటలో విధ్వంసకుడు బెన్‌ స్టోక్స్‌. ఈ ఇద్దరి మేళవింపే జానీ బెయిర్‌స్టో అని ఇంగ్లీశ్‌ క్రికెట్‌ పండితులు కితాబిస్తారు. అందుకు తగినట్టే బెయిర్‌స్టో ధనాధన్‌ జోరు ఉంటుంది.. కానీ అందులో నిలకడే లోపించింది. వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో బెయిర్‌స్టో సత్తా, సామర్థ్యంపై వాదనలకు చోటు లేదు. కానీ టెస్టుల్లో ఇతడి గణాంకాలు అందుకు ఉసిగొల్పుతు న్నాయి. ఇంగ్లాండ్‌ తరఫున 100 టెస్టులు ఆడిన 16వ ఆటగాడిగా నిలువనున్న బెయిర్‌స్టో ఓ చెత్త రికార్డునూ మూటగట్టుకున్నాడు. వంద టెస్టులు ఆడిన ఆటగాళ్లలో అతి తక్కువ బ్యాటింగ్‌ సగటు (36.42) కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు. 2012లో లార్డ్స్‌ వేదికగా వెస్టిండీస్‌పై అరంగ్రేటం చేసిన జానీ బెయిర్‌స్టో.. ధర్మశాలలో కెరీర్‌ 100వ టెస్టు ఆడటం కొంతమందికి ఆశ్చర్యం కలిగించేదే. అందుకే బెయిర్‌స్టో 100వ టెస్టు అనుకోకుండా జరిగిందనే చెప్పాలి!. ఇంగ్లీశ్‌ క్రికెటర్‌గా జానీ బెయిర్‌స్టో అవకాశాలు పుష్కలంగా దక్కించుకున్నాడు. కెరీర్‌ ఆరంభంలో బెయిర్‌స్టో చూపిన దూకుడు, జోరు ఆ తర్వాత నెమ్మదిగా కనుమరుగ య్యాయి. టెస్టు కెరీర్‌లో బెయిర్‌స్టో ఇప్పటివరకు 12 సెంచరీలు, 26 అర్థ సెంచరీలే చేశాడు. 58.68 స్ట్రయిక్‌రేట్‌తో 5974 పరుగులు చేశాడు. 2016, 2022 బెయిర్‌స్టో టెస్టు కెరీర్‌లో అత్యుత్తమం. 1470 పరుగులు, 70 వికెట్లలో భాగస్వామ్యం (క్యాచ్‌, స్టంప్డ్‌)తో 2016 క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. నాలుగు సెంచరీలు సహా 681 పరుగులతో 2022లో బజ్‌బాల్‌ మేనియాలో అదరగొట్టాడు. 2018 శ్రీలంకతో టెస్టులో అసమాన శతక ఇన్నింగ్స్‌, 2022 హెడింగ్లే ఇన్నింగ్స్‌తో బెయిర్‌స్టో అభిమానుల హృదయాల్లో చోటు సాధించాడు. ప్రస్తుత భారత్‌తో టెస్టు సిరీస్‌లో బెయిర్‌స్టో మంచి ఆరంభాలను సద్వి నియోగం చేసుకోలేదు. కెరీర్‌ వందో టెస్టులో తనదైన భయమెరు గని ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడేందుకు జానీ బెయిర్‌స్టో ఎదురుచూస్తున్నాడు. బెయిర్‌స్టో తండ్రి డెవిడ్‌ బెయిర్‌స్టో ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌. తండ్రి వికెట్‌ కీపర్‌ కావటంతో బెయిర్‌స్టో వికెట్‌ కీపర్‌గా జట్టులో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తాడు.