
లక్ష్యాలను స్వయం కృషితో సాధించాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే జెండగే విద్యార్ధినీ విద్యార్ధులకు సూచించారు. బుధవారం నాడు ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేటు సమావేశ మందిరంలో పదికి పది (10/10) జీపీఏ సాధించిన ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన 68 మంది విద్యార్దినీ విద్యార్ధులకు జిల్లా కలెక్టరు మెమొంటోలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులు, విద్యార్ధులతో మాట్లాడుతూ.. ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం రాబోయే విద్యార్ధినీ విద్యార్ధులకు స్పూర్తిగా ఉంటుందని, పదికి పది సాధించిన ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్ధినీ విద్యార్ధులందరికీ శుభాకాంక్షలు అందిసున్నానని అన్నారు. మీకు నేర్పించిన దానిని మీరు వ్రాయబట్టే ఇది సాధ్యమైందని, మీరు కాలేజీలకు వెళతారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అక్కడ కూడా మీలా ప్రతిభ కలిగిన వారు వస్తారు, అందులో సరైన వారిని స్నేహితులుగా ఎంచుకోవాలని, మీరు తల్లిందండ్రులకు దూరంలో వుంటారు కాబట్టి మొబైల్స్ ఫోన్లపై నియంత్రణ ఉండాలని, వ్యక్తిత్వ వికాసంపై శ్రద్ద పెట్టాలని, కమ్యూనికేషన్ స్కిల్స్ పై దృష్టి సారించాలని అన్నారు. మీరు నచ్చిన రంగాలలో అభివృద్ధి చెందాలని, విజయం సాధించడానికి లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, స్వయం కృషితో సాధించాలని ఉద్బోధించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని, ప్రభుత్వ పాఠశాలల్లో బడి బాట కార్యక్రమాల ద్వారా పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న వసతుల పట్ల అందరికి అవగాహన కలిగిస్తున్నట్లు, యూనిఫామ్స్, బుక్స్ అందిస్తున్నట్లు తెలియచేస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పదికి పది జిపిఎ సాధించడానికి ఉపాధ్యాయులు పనిచేసున్నారని అన్నారు. విద్యార్ధులలో ఉత్సాహం నింపడానికి ఇండియన్ రెడ్స్ సంస్థ చొరవ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు గంగాధర్ మాట్లాడుతూ.. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ప్రజల ఆరోగ్యానికి ఒక చిహ్నంగా నిలిచిందని, స్వచ్చందంగా నిష్పక్షపాతంగా ఒక జీవితాన్ని ప్రసాదించాలనే ఉద్దేశ్యంతో మానవతా వాదాన్ని చాటేలా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, అందులో భాగంగా విద్యార్ధులలో నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి పనులు చేపట్టడం ప్రశంసనీయమని అన్నారు. పదికి పది సాధించిన 68 మందిలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 31 మంది విద్యార్దినీ విద్యార్ధులు అందరికీ మార్గదర్శకంగా నిలిచారని, అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇది స్పూర్తివంతమైన కార్యక్రమమని, 31 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు పదికి పది సాధించడం హర్షనీయమని అన్నారు. పిల్లల అభిరుచి బట్టి ఆయా రంగాలలో రాణించేలా చూడాలని, వారు రాణించే రంగాలలోనే ఎదుగుతారని, అనేక అవకాశాలున్నాయని, పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ స్టేట్ మెంబర్ ఆర్ మహేందర్రెడ్డి, రెడ్డిస్ జిల్లా ఛైర్మన్ జి లక్ష్మినర్సింహ్మారెడ్డి, వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ, డివిజన్ చైర్మన్ సద్ది వెంకటరెడ్డి, డైరెక్టర్లు కొడారి వెంకటేశ్ యాదవ్, జంపాల అంజయ్య, తల్లిదండ్రులు, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.