రేపటి నుంచే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు

నవతెలంగాణ – తుంగతుర్తి
ఈనెల 18 నుండి ఏప్రిల్ 2 వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి.ఈ మేరకు జిల్లా అధికారులు అన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు.జిల్లావ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 35 పరీక్షా కేంద్రాలు ప్రైవేటు పాఠశాలల్లో, 32 పరీక్షా కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేంద్రాలలో 11,946 మంది రెగ్యులర్ విద్యార్థులు, 187 మంది సప్లమెంటరీ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు.విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా అధికారులు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు.ఆర్టీసీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని తెలిపారు.పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సదుపాయం, వైద్య సిబ్బందిని ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ప్రతి పరీక్షా కేంద్రం నుండి 100 మీటర్ల వరకు పోలీసు బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని,పరీక్షలు జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని తెలిపారు.పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని,9:35 దాటితే పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించరని తెలిపారు.
ఇన్విజిలేటర్లు విద్యార్థులు పాటించాల్సిన నియమాలు: పరీక్షా కేంద్రాలలో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఫోటో ఐడి కార్డును ధరించాలని,అదేవిధంగా ప్రతి విద్యార్థి హాల్ టికెట్తో పరీక్షకు హాజరుకావాలని సూచించారు.ప్రతి విద్యార్థి ప్రశ్నాపత్రం పై తప్పనిసరిగా హాల్ టికెట్ నెంబర్ రాయాలని,జవాబు పత్రంపై ఎక్కడ కూడా హాల్ టికెట్ నెంబర్లు రాయవద్దని సూచించారు.సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాలలోనికి తీసుకురాకూడదని పరీక్షా సమయం పూర్తయ్యే వరకు విద్యార్థులు సిబ్బంది పరీక్షా కేంద్రాన్ని విడిచి వెళ్ళకూడదు అని సూచించారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుందని జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ తెలిపారు.జిల్లావ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘాలో ప్రశ్నాపత్రాలను తెరిచేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సంవత్సరం సైన్స్ విభాగానికి రెండు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని 1.భౌతిక రసాయన శాస్త్రం 2.జీవశాస్త్రం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 67 పరీక్షా కేంద్రాలలో 67 మంది చీఫ్ సూపర్డెంట్లు 67 మంది డిపార్ట్మెంటల్ అధికారులు 740 మంది ఇన్విజిలేటర్లు 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.జిల్లా స్థాయిలో హెల్ప్ లైన్ నెంబర్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి 7995087629 కంట్రోల్ రూమ్ నెంబర్ పరీక్షల కమిషనర్ 9848809754 సంప్రదించాలని సూచించారు. మండల స్థాయిలో మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించాలని సూచించారు.