టెన్త్‌ పరీక్షలు ప్రారంభం

10th exams start– తొలిరోజు 1,838 మంది గైర్హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. వచ్చేనెల రెండో తేదీ వరకు ఇవి జరుగుతాయి. మొదటి రోజు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పరీక్షను నిర్వహించామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 4,96,138 మంది దరఖాస్తు చేయగా, వారిలో 4,94,300 (99.63 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. 1,838 (0.37 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. రెగ్యులర్‌ విద్యార్థులు 4,94,877 మంది దరఖాస్తు చేస్తే, 4,93,417 (99.70 శాతం) మంది పరీక్ష రాశారని తెలిపారు. 1,460 (0.30 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రయివేటు విద్యార్థుల్లో 1,261 మంది దరఖాస్తు చేసుకుంటే, 883 (70.02 శాతం) పరీక్షకు హాజరయ్యారని వివరించారు. 378 (29.98 శాతం) మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మొదటిరోజు నలుగురు విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్‌ కేసులను నమోదు చేశారని పేర్కొన్నారు. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఖమ్మంలో ఒకరు, ఆసిఫాబాద్‌లో ఇద్దరు ఇన్విజిలేటర్లను తొలగించామని తెలిపారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని వివరించారు. ఈ ఏడాది ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించారు.
బూట్లతో వచ్చిన విద్యార్థులకు నో ఎంట్రీ
పదో తరగతి పరీక్షలు రాసేందుకు బూట్లు వేసుకుని వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు అనుమతించలేదు. బూట్లు విడిపించి వారిని లోపలికి అనుమతించిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. బషీర్‌బాగ్‌లో ఓ ప్రభుత్వ పాఠశాల, నాగోల్‌లో ఓ ప్రయివేటు పాఠశాలలో ఈ సంఘటనలు జరిగాయి. హాల్‌టికెట్లలోగానీ, ప్రభుత్వ పరీక్షల విభాగం నిబంధనల్లోగానీ బూట్లు వేసుకుని విద్యార్థులు హాజరు కావొద్దంటూ పేర్కొనకపోవడం గమనార్హం. బూట్లు వేసుకుని వస్తే అనుమతించబోమన్న నిబంధనలను విద్యాశాఖ విధించలేదు. కానీ అధికారులు మాత్రం బూట్లు వేసుకుని వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతించలేదు.