సాప్ట్‌ వేర్‌ ఎగుమతుల్లో 11.3 శాతం వృద్ధి:

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు
సాఫ్ట్‌ వేర్‌ ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే తెలంగాణా మూడింతల వృద్ధి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. 2024-25 మొదటి మూడు నెలల్లో జాతీయ ఐటీ ఎగుమతులు కేవలం 3.3 శాతం మాత్రమే పెరగగా, ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య 11.3 శాతం రాష్ట్ర వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. సెప్టెంబర్‌ 5,6 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న గ్లోబల్‌ ఏఐ సదస్సుకు కర్టనైజర్‌గా ‘నాస్కామ్‌’ బుధవారం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గత ఏడాది ఐటీ రంగంలో 40,570 కొత్త ఉద్యోగాలు వచ్చాయని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా నాస్కామ్‌ రూపొందించిన ”ఏఐ అడాప్షన్‌ 2.0” నివేదికను ఆయన విడుదల చేసారు. కృత్రిమ మేథను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో అనేక సవాళ్లు ఉన్నాయనీ, వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్తామని చెప్పారు. హెల్త్‌ కేర్‌, వ్యవసాయ రంగాల్లో ఏఐ వినియోగం విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేసారు.