4 రోజుల్లో 11 కేసులు

11 cases in 4 days– మధ్యప్రదేశ్‌లో పాత్రికేయునిపై
– మంత్రి అనుచరుల వేధింపులు
భోపాల్‌ : దేశవ్యాప్తంగా స్వతంత్ర మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులపై అక్రమ కేసులు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ధోరణి బాగా కన్పిస్తోంది. మధ్యప్రదేశ్‌లో ‘దైనిక్‌ ఖులాసా’ అనే పోర్టల్‌లో క్రైమ్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్న జలామ్‌ సింగ్‌పై గత నెలలో 7-10 తేదీల మధ్య కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే పోలీసులు పదకొండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. గ్వాలియర్‌ డివిజన్‌లోని గునా, శివపురి జిల్లాల్లోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఈ కేసులు నమోదు చేశారు. ఇంతకీ సింగ్‌ చేసిన నేరమేమిటంటే ఆయన గత నెల 7వ తేదీన ఎవరి పేరునూ ప్రస్తావిం చకుండా ఓ వీడియోను, మెసేజ్‌ని పోస్ట్‌ చేశారు. తరచూ పార్టీలు మారుతున్న గౌరవనీయమైన వ్యక్తి వ్యవహారం బీజేపీ అధిష్టానం దృష్టికి వచ్చిందని, దీంతో ఆయనకు టికెట్‌ గల్లంతయ్యే అవకాశం ఉన్నదని దాని సారాంశం. వీడియోలో సింగ్‌ ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ అది మధ్యప్రదేశ్‌ పంచాయత్‌ శాఖ సహాయ మంత్రి మహేంద్ర సింగ్‌ సిసోడియాను ఉద్దేశించి చేసినదేనంటూ ఆయన మద్దతుదారులు ఆగ్రహంతో ఊగిపోయారు. వేర్వేరు పోలీస్‌ స్టేషన్లలో సిసోడియాపై కేసులు పెట్టారు. సిసోడియా ప్రతిష్టకు జలామ్‌ సింగ్‌ భంగం కలిగిస్తున్నారని, డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌ల నేపథ్యంలో సింగ్‌ను అరెస్ట్‌ చేశారు. ముందస్తు బెయిల్‌ కోసం ఆయన దరఖాస్తు చేసినప్పటికీ న్యాయస్థానం దానిని తోసిపుచ్చడంతో కోర్టులో లొంగిపోయారు. ఆయన ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.
కమల్‌నాథ్‌ క్యాబినెట్‌లో సిసోడియా మంత్రిగా పనిచేశారు. జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఉన్నారు. 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలుపొంది మంత్రి అయ్యారు. బీజేపీలో చేరకపోతే కాంగ్రెస్‌ సభ్యులపై ‘బుల్‌డోజర్‌’ చర్య తీసుకుంటామంటూ బెదిరించడం ద్వారా ఈ సంవత్సరం జనవరిలో వార్తల్లోకి ఎక్కారు. మధ్య ప్రదేశ్‌ శాసనసభకు నవంబర్‌ 17న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆయనకు ఇప్పటి వరకూ బీజేపీ అధిష్టానం టికెట్‌ కేటాయించలేదు.