పౌర సరఫరాలశాఖలో రూ.1100 కోట్ల కుంభకోణం

పౌర సరఫరాలశాఖలో రూ.1100 కోట్ల కుంభకోణం– సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ ప్రమేయం : కేటీఆర్‌
– హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరిపించాలంటూ డిమాండ్‌
– అది కాంగ్రెస్‌ కాదు.. స్కాంగ్రెస్‌ పార్టీ అంటూ ఎద్దేవా
– కేంద్రం స్పందించకపోవటంపై అనుమానాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో రూ.1100 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. అందులో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ ఢిల్లీ పెద్దల ప్రమేయముందని ఆయన విమర్శించారు. ఈ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్లు వాసుదేవరెడ్డి, రవీందర్‌సింగ్‌ తదితరులతో కలిసి కేటీఆర్‌ మాట్లాడారు. సివిల్‌ సప్లయిస్‌ డిపార్టుమెంట్‌ ఆధ్వర్యంలో 35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలనే పేరుతో రూ.750 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కింద 2.20 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం కొనుగోలు ప్రక్రియలో మరో రూ.350 కోట్ల మేర ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ఈ రకంగా మొత్తం రూ.1,100 కోట్ల స్కామ్‌ రెండు భాగాలుగా జరిగిందని చెప్పారు. సంబంధిత ఆధారాలను, వివరాలను ఆయన ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు. తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పౌర సరఫరాల కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ రవీందర్‌ సింగ్‌ ఈ కుంభకోణాన్ని 15 రోజుల కిందే బయటపెట్టారనీ, అయినా ముఖ్యమంత్రి గానీ, మంత్రి ఉత్తమ్‌గానీ స్పందించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం గతంలో సేకరించి, మిల్లర్ల దగ్గర ఉంచిన 35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా రేవంత్‌ సర్కార్‌ గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించిందని గుర్తు చేశారు. ఈ యేడాది జనవరి 25న ఇదే అంశంపై ప్రభుత్వం ఒక కమిటీని వేసిందనీ, అదే రోజు మార్గదర్శకాలను జారీ చేసి, టెండర్లను ఆహ్వానించిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో క్వింటాలకు రూ.2,100కు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి రైస్‌ మిల్లర్లు సుముఖత వ్యక్తం చేస్తే, దాన్ని తిరస్కరించిన ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్ల వైపే మొగ్గు చూపిందని విమర్శించారు.
ప్రత్యేక నిబంధనల పేరిట కేంద్రీయ బండార్‌, ఎల్జీ ఇండిస్టీస్‌, హిందూస్తాన్‌, నాకాఫ్‌ అనే నాలుగు కంపెనీలకే టెండర్లు దక్కేలా తతంగం నడిపారని పేర్కొన్నారు. వీటిలో కేంద్రీయ బండార్‌ అనే సంస్థను గతంలో తమ ప్రభుత్వం బ్లాక్‌ లిస్టులో పెట్టిందని వివరించారు. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆ సంస్థ కోసం నిబంధనలను సవరించారని తెలిపారు. మంత్రి ఉత్తమ్‌ సమక్షంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో జరిగిన ఓ అనధికారిక ఒప్పందం ప్రకారమే ఈ అవినీతి అంతా జరిగిందని కేటీఆర్‌ ఈ సందర్భంగా ఆరోపించారు. సీఎం కార్యాలయానికి ఖర్చులు, ఢిల్లీకి డబ్బులు పంపించాలనే కారణాలతో ప్రభుత్వాధినేతలు ఈ దందాలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ అంటేనే కుంభకోణాల కుంభమేళా అని ఎద్దేవా చేశారు. ‘అది కాంగ్రెస్‌ కాదు.. స్కాంగ్రెస్‌…’ అంటూ దుయ్యబట్టారు. గల్లీలో దోచుకోవటం, ఢిల్లీకి సూట్‌కేసులు పంపటమే ఆ పార్టీ నేతల పని అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ అవినీతిపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా స్వయంగా ఆరోపణలు గుప్పిస్తున్నా కేంద్ర ప్రభుత్వం గానీ, ఎఫ్‌సీఐ గానీ స్పందించకపోవటం శోచనీయమన్నారు. ఇప్పటికైనా దీనిపై కేంద్రం, ఎఫ్‌సీఐ స్పందించాలనీ, లేదంటే ఈ కుంభకోణంలో బీజేపీ పాత్ర కూడా ఉందని భావించాల్సి వస్తుందంటూ కేటీఆర్‌ హెచ్చరించారు. ఇలాంటి స్కాములపై న్యాయపరంగా కూడా ముందుకెళతామని తెలిపారు.