గాజాలో 24గంటల్లో 111మంది మృతి

– భారీగా పెరుగుతున్న నిర్వాసితులు
– బీరుట్‌పై కొనసాగుతున్న దాడులు
– హిజ్బుల్లా మీడియా అధికారి,
– మరో ఎనిమిదిమంది వైద్యసిబ్బంది బలి
గాజా, బీరుట్‌: అడ్డూ అదుపు లేకుండా గాజాలో కొనసాగుతున్న దాడుల్లో గత 24 గంటల్లో 111మంది పాలస్తీనియన్లు మరణించారు. 158మంది గాయపడ్డారని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. గత నెల రోజుల కాలాన్ని పరిశీలించినట్లైతే ఆదివారం (17వ తేదీ) అత్యంత దారుణమైన రీతిలో దాడులు జరిగినట్లు వఫా వార్తా సంస్థ ప్రకటించింది. గాజాలో ఇజ్రాయిల్‌ ఆర్మీ జారీ చేసే ఆదేశాల కారణంగా కొత్తగా నిర్వాసితులయ్యే వారి సంఖ్య పెరుగుతోందని డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ (ఎంఎస్‌ఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు గాజా దాడుల్లో మరణించిన వారి సంఖ్య 43,922కి చేరగా, గాయపడిన వారి సంఖ్య 1,03,898కి పెరిగింది. గాజా నగరంలోని తమ క్లినిక్‌ ఒకటి అటువంటి నిర్వాసితులతో నిండిపోయిందన్నారు. ఇప్పటికే లక్షా 40వేల మంది వున్నారని, ఇంకా ప్రతి రోజూ కొత్తగా వస్తూనే వున్నారని ఎంఎస్‌ఎఫ్‌కి చెందిన అమండె బెజెరాలె చెప్పారు. రోజుకు కనీసం 300మంది గాయాలతో వస్తున్నారన్నారు. అలాగే చాలామంది సరైన చికిత్స, మందులు లేకుండా ముదిరిపోయిన రోగాలతో బాధపడుతున్నారని చెప్పారు. ఉత్తర గాజాలో జాబాలియా, బెయిట్‌ లాహియా, బెయిట్‌ హనూన్‌ వంటి ప్రాంతాల్లో తమ సిబ్బంది అనేకమంది చిక్కుకుపోయారని, అక్కడి భయానక పరిస్థితులు వారు వివరిస్తుంటే తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని చెప్పారు. ఉత్తర గాజాకు సరైన మొత్తంలో మందులు కూడా చేరడం లేదన్నారు. వెస్ట్‌ బ్యాంక్‌లో పది మందిని ఇజ్రాయిల్‌ సైనికులు అదుపులోకి తీసుకున్నారు.