12 మంది గవర్నర్లు, ఒక ఎల్జీ నియామకం

–  రాష్ట్రపతి ద్రౌపది ఉత్తర్వులు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ఏపీ గవర్నర్‌గా తోఫా
– అయోధ్య, నోట్ల రద్దు కేసుల్లో కేంద్రానికి అనుకూల తీర్పులు
– త్రిపుల్‌ తలాక్‌ కేసులో వ్యతిరేకం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ తో పాటు దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలకు గవర్నర్లు, లడఖ్‌ కు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) నియామకమ య్యారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. అందులో కొత్తగా ఆరుగురిని గవర్నర్లుగానియమించగా, ఏడుగురు గవర్నర్లను బదిలీ చేశారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్‌ నజీర్‌ను ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించారు. తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్‌ నేత సిపి రాధాక్రిష్ణన్‌ను జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ కైవల్యా త్రివిక్రమ్‌ పర్ణాయక్‌, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య, అసోం గవర్నర్‌గా గులాబ్‌ చంద్‌ కఠారియా, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లాలు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను చత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి గవర్నర్‌గా బదిలీ చేశారు. మహారాష్ట్ర గవర్నర్‌గా రాజీనామా చేసిన భగత్‌ సింగ్‌ కోశ్యారీ స్థానంలో జార్ఖండ్‌ గవర్నర్‌ రమేష్‌ బైస్‌ను నియమించారు. ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ సుశ్రీ అనుసూయను మణిపూర్‌ గవర్నర్‌గా , మణిపూర్‌ గవర్నర్‌ గణేశన్‌ ను నాగాలాండ్‌ గవర్నర్‌గా, బీహార్‌ గవర్నర్‌ ఫాగు చౌహాన్‌ను మేఘాలయ గవర్నర్‌గా నియమించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ను బీహార్‌ గవర్నర్‌గా,,అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బిడి మిశ్రాను లడఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించారు.