న్యూఢిల్లీ : ప్రయివేటు హాస్టల్లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులపై ఇకపై అదనంగా భారం పడొచ్చు. హాస్టల్‌లో నివాసానికి చెల్లించే అద్దెపై 12 శాతం జిఎస్‌టి వర్తిస్తుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఎఎఆర్) బెంగళూరు, లక్కో బెంచ్‌లు రెండు వేర్వేరు కేసుల్లో స్పష్టం చేశాయి. పేయింగ్ గెస్ట్ (పిజి), హాస్టళ్లు, గృహ వసతి కిందకు రావని.. అవి వాణిజ్యపరమైనందున జిఎస్‌టి నుంచి మినహాయింపు ఉండదని ఎఎఆర్ కర్ణాటక బెంచ్ తాజాగా తెలిపింది. రోజుకు రూ.1000 కంటే తక్కువ అద్దె వసూలు చేసే హాస్టళ్లకు 2022 జూలై 17 వరకు మాత్రమే జిఎస్‌టి నుంచి మినహాయింపు ఇచ్చినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇకపై హాస్టళ్లపై 12 శాతం జిఎస్‌టి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఆగస్ట్ 2న జరగనున్న జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో వేచి చూడాలి.