– తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
అక్రమ మైనింగ్ కేసులో నిందితుడైన పటాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి చెందిన బ్యాంకు లాకర్ నుంచి 1.2 కేజీల బంగారు బిస్కెట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1 కోటి పైనే ఉంటుందని అంచనా వేశారు. పటాన్‌చెరు, సంగారెడ్డిలో అక్రమ మైనింగ్ జరపటం ద్వారా భారీ మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసుదన్‌రెడ్డి గండిగొట్టారని ఈడీ అభియోగం మోపిన విషయం తెలిసిందే. దాదాపు రూ.300 కోట్ల మేరకు అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్టుగా కూడా ఈడీ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తును ముందుకు కొనసాగించిన ఈడీ అధికారులు.. తాజాగా పటాన్‌చెరులోని ఎస్బీఐ బ్యాంకులో మహిపాల్‌రెడ్డి లాకర్ నుంచి రూ.కోటికి పైగా విలువైన బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు. ఈ బంగారు బిస్కెట్లను విదేశాల నుంచి కొనుగోలు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. వీటికి సంబంధించి ఎలాంటి రశీదులు కూడా లేవని ఈడీ అధికారులు తేల్చారు. అలాగే, బుధవారం పటాన్‌చెరులోని యాక్సిస్ బ్యాంకు లాకర్ నుంచి మహిపాల్‌కు సంబంధించి విలువైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనపర్చుకున్న విషయం తెలిసిందే. అయితే, డాక్యుమెంట్లలో వందకు పైగా బినామీలకు చెందిన పేర్లతో రూ. కోట్ల విలువైన భూముల దస్తావేజులు కూడా ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఇప్పటికే మహిపాల్‌రెడ్డిని, ఆయన సోదరుడిని, ఆయన(మహిపాల్‌రెడ్డి) కుమారుడిని విచారించిన ఈడీ అధికారులు.. మరోసారి వీరిని విచారించటానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.