– డ్రగ్స్ మూలాలపై దృష్టి స్నిఫర్ డాగ్స్‌తో గుర్తింపు
– నూతన సంవత్సర వేడుకలు రాత్రి ఒంటిగంట వరకే..
– పోలీసులు సిఫారసు లేఖలతో వస్తే చర్యలు
– రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గం : హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
– నగర నేరాల వార్షిక నివేదిక విడుదల
నవతెలంగాణ-సిటీబ్యూరో
గత ఏడాదితో పోల్చితే హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో మహిళలపై 12శాతం దాడులు పెరిగాయి. అయితే సైబర్‌క్రైమ్, దోపిడీలు, దొంగతనాలు, మహిళలపై దాడులతోపాటు ఇతర అన్ని విభాగాల్లో కలిపి 2022 ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్ రేటు 2శాతం మేర పెరిగిందని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనంలోని ఆడిటోరియంలో నగర నేర వార్షిక నివేదికను సీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో వచ్చిన పండుగలు, ర్యాలీలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు సహా అన్ని కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేశామన్నారు. నగర కమిషనరేట్ పరిధిలో ఐదు డీసీపీ జోన్లను ఏడుకు పెంచుకున్నామని, సివిల్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు సైతం పెరిగాయన్నారు. ఈ ఏడాదిలో నగరంలో మహిళలపై నేరాలు పెరిగాయన్నారు. మహిళలపై లైంగిక దాడుల కేసులు 2022లో 343 ఉంటే, ఈ ఏడాది 403 నమోదయ్యాయన్నారు. ఈ ఏడాదిలో హత్యలు తగ్గి, స్థిరాస్తి సంబంధిత నేరాలు 3శాతం మేర పెరిగాయన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ ఏడాది మత్తు పదార్థాలు వాడిన 740 మందిని అరెస్టు చేశారన్నారు. డ్రగ్స్ కేసులో 13 మంది విదేశీయులు సైతం ఉన్నారని తెలిపారు. డ్రగ్స్ మూలాలపై దృష్టి సారించామని, సరఫరా చేసేవాళ్లు ఎక్కడ ఉన్నా వెతికి పట్టికుంటామన్నారు. డ్రగ్స్‌ను గుర్తించేందుకు స్నిఫర్ డాగ్స్‌ను వాడతామని తెలిపారు. 11శాతం సైబర్ నేరాలు పెరిగాయని, వాటిని నివారించేందుకు అన్ని చర్యలూ చేపడతామన్నారు. సైబర్‌క్రైమ్, నార్కోటెక్ విభాగాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. గతేడాది సైబర్ నేరాల్లో రూ.82కోట్ల మోసాలు జరిగితే, ఈ ఏడాది రూ.133కోట్లను సైబర్ నేరగాళ్లు కొళ్లగొట్టారన్నారు. ఇక ఆర్థిక నేరాలు స్వల్పంగా పెరిగాయన్నారు.
నగర రోడ్లపైకి ప్రతిరోజూ 16150 కొత్త వాహనాలు
రోజురోజుకూ ట్రాఫిక్ పెరుగుతోందని సీపీ తెలిపారు. ప్రతి రోజూ 16150 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయన్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
మరికొంత మందిని అరెస్టు చేస్తాం..
బిగ్‌బాస్ టైటిల్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో నుంచి ఊరేగింపుగా బయలుదేరాడని, మరో మార్గం నుంచి వెళ్లాలని చెప్పినా వినిపించుకోలేదని సీపీ తెలిపారు. అభిమానం ముసుగులో విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. ప్రశాంత్ మూలంగానే సంఘటన జరగడంతో కేసు నమోదు చేశామని, సీసీ టీవీ పుటేజీలను పరిశీలించిన తర్వాత మరికొంత మందిని అరెస్టు చేస్తామని చెప్పారు.
నిమిషం ఆలస్యమైనా చర్యలు
నూతన సంవత్సర వేడుకలను రాత్రి ఒంటి గంటలోపు ఆపేయాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్బులు, బార్లలో డ్రగ్స్ ఉన్నాయని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇక ఎప్పటికీ వాటిని తెరవలేరని అన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోతే రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
టాలెంట్ ఉన్నవారికే ప్రమోషన్లు
పోలీసులు పోస్టింగ్‌ల కోసం సిఫారసు లేఖలతో వస్తే చర్యలు తప్పవని, టాలెంట్ ఉన్నవారికే ప్రమోషన్లు ఇస్తామని సీపీ తెలిపారు. సిఫారసు లేఖలతో వచ్చేవారికి పోస్టింగ్‌లు ఉండవని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. లేఖలు పట్టుకుని వస్తే ఏసీఆర్‌లో పేర్లు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఒక్కసారి పేరు నమోదు చేస్తే ప్రమోషన్లు రావని స్పష్టం చేశారు.