రూ.30 లక్షలు విలువ చేసే.. 120 కేజీల గంజాయి పట్టివేత

Worth Rs.30 lakhs.. Seizure of 120 kg of ganjaనవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 120 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.30 లక్షల ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. డిసెంబర్‌ 28వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో కేఏ-38, ఏ-3677 నంబర్‌ గల ట్రక్‌లో నిషేధిత గంజాయిని తరలిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం మేరకు టేకులపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఎస్‌ఐ రమణారెడ్డి తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు చేస్తున్నట్టు తెలుసుకున్న నిందితుడు నిషేధిత గంజాయి ఉన్న తన వాహనాన్ని స్థానిక పెట్రోల్‌ బంకు వెనుక వైపు వదిలేసి పారిపోయాడు. అప్పటి నుంచి ఆ వాహనం అక్కడే ఉండటంతో అనుమానాస్పద వాహనం ఉన్నట్టు స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐ రమణారెడ్డి వాహనాన్ని సోదా చేశారు. అందులో ఉన్న 3 ఇనుప బీరువాలను గ్యాస్‌ కట్టర్‌ ద్వారా తెరిచి చూడగా, ఒక బీరువా ఖాళీగా ఉండగా, రెండు బీరువాల్లో గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. నిషేధిత గంజాయిని దాచిపెట్టిన రెండు బీరువాలు కూడా పైకి చూడటానికి ఖాళీగా, కొత్త బీరువాల్లా కనిపించాయి. బీరువాలో ముందు భాగాన్ని ఖాళీగా ఉంచి బీరువా వెనుక గంజాయిని అమర్చడానికి వీలుగా తయారు చేశారు. సుమారు 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై విచారించగా.. కర్నాటకలోని బీదర్‌కు చెందిన మహమ్మద్‌ షకీల్‌ పాషా పేరు మీద వాహనం రిజిస్టర్‌ అయి ఉన్నట్టు తేలిందని పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్‌ లాంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. విలేకర్ల సమావేశంలో ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి, టేకులపల్లి సీఐ ఇంద్రాసేనా రెడ్డి, టేకులపల్లి ఎస్‌ఐ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.