– 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ఎన్నికల్లో 88 స్థానాలకు ఎన్నికలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రెండో దశ సార్వత్రిక ఎన్నికల్లో 1,210 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల రెండో దశలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగే 88 స్థానాల్లో 1,210 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. 88 స్థానాల్లో 2,633 నామినేషన్లు దాఖలయ్యాయి. దాఖలైన 2,633 నామినేషన్ల పరిశీలన తరువాత 1,428 నామినేషన్లు చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించినట్లు పేర్కొంది. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నామినేషన్ల ఉపసంహరణ తరువాత 1,210 మంది బరిలో ఉన్నారని పేర్కొంది. కేరళలో 20 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి అత్యధికంగా 500 నామినేషన్లు, కర్ణాటకలోని 14 స్థానాల నుంచి 491 నామినేషన్లు వచ్చాయి. త్రిపురలో ఒక స్థానం నుంచి కనీసం 14 నామినేషన్లు వచ్చాయి. మహారాష్ట్రలోని నాందేడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి గరిష్టంగా 92 నామినేషన్లు వచ్చాయి. అయితే కేరళలో 500 నామినేషన్లలో 204 నామినేషన్లను ఆమోదించగా, మిగిలిన వాటిని తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత, 194 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కర్నాటకలో 247, మహారాష్ట్రలో 204, కేరళలో 194, రాజస్థాన్ 152, ఉత్తరప్రదేశ్‌లో 91, మధ్యప్రదేశ్‌లో 88, అసోంలో 61, బీహార్‌లో 50, పశ్చిమ బెంగాల్‌లో 47, చత్తీస్‌గఢ్ లో 41, జమ్ము కాశ్మీర్‌లో 22, త్రిపురలో 9 మంది బరిలో ఉన్నారు.
ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మరో 100 కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పారామిలిటరీ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)ని మోహరించాలని ఎన్నికల సంఘం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖని ఆదేశించినట్టు వర్గాలు తెలిపాయి.