126 సర్వే నెంబర్ లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

126 Arbitrary illegal constructions in survey no– ఇప్పటికే వివాదాస్పదంగా మారిన స్థలం
– ప్రభుత్వ స్థలానికి కంచె ఏర్పాటు చేయాలంటున్న స్థానికులు
నవతెలంగాణ – సూర్యాపేట
జిల్లా కేంద్ర పరిధిలో గల కుడ కుడా లోని 126 వ సర్వే నెంబర్ లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారి పక్కనే అనుమతులకు విరుద్ధంగా వెలుస్తున్న నిర్మాణాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు మెండుగా ఉండటం తోనే నిబంధనలను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.కుడ కుడా కు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే కోమటి కుంట నుండి నూతనంగా ఏర్పడిన కలెక్టరేట్ కు వెళ్లే రహదారి కి అనుకోని ఉన్న పల్లె ప్రకృతి వనం ఎదురుగా ఉన్న 126 సర్వే నెంబర్ కు చెందిన గుట్ట ప్రాంతంలో వరుసగా నిర్మాణాలు వెలుస్తున్నాయి.కానీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.కాగా ఇక్కడి అక్రమ నిర్మాణదారులు ప్రభుత్వ భూమితో పాటు ఇతరుల భూములను కూడా ఆక్రమించి ఇంటి నిర్మాణాలు చేపట్టడం గమన్హారo. కలెక్టరేట్ కు వెళ్లే దారిలో కనిపించే విధంగానే నిర్మాణాలు వెలుస్తున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదిలావుండగా ఇదే సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా రిజిస్ట్రేషన్లు కావడం గమనార్హం.వీటికి ఆనాడు జిల్లా స్థాయి అధికారుల నుండి క్రింది స్థాయి అధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగం నడిచినట్లు ప్రచారం సాగుతోంది.ఇక్కడ బి.ఆర్.యస్ నాయకులకు,కొందరు జర్నలిస్టులకు నిబంధనలకు విరుద్ధంగా వందలాది గజాల స్థలం కేటాయించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే.
అదేవిధంగా దీనికి మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లు కేటాయించడం గమన్హారo.నిరుపేదలకు చెందాల్సిన స్థలాన్ని అనహార్హులకు ఆనాడు అధికారులు అప్పనంగా కేటాయించారు. ఇదిగాక 58,59 జివో కు విరుద్ధంగా స్థలంలో ఇండ్ల నిర్మాణం లేక పోయినా వున్నట్లుగా వాటికి ఇంటి నెంబర్లు కేటాయిస్తూ మార్పింగ్ ఫోటోలు పెట్టి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.దీంతో కోట్లాది రూపాయల భూములు అన్యాక్రాంతం అయ్యాయి.దీంతో ఈ సర్వే నెంబర్ లో నిబంధనలకు విరుద్ధంగా స్థలాల కేటాయింపు జరగడం…. కొందరేమో అక్రమంగా ఇండ్లను బాహాటంగా నిర్మించుకుంటున్నారు. ఈ సర్వే నెంబర్ పై కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నారు. కానీ దీనిపై ఇంకా నేటికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం గమన్హారo..ఈ రకంగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్న వీటిపై అధికారులు స్పందించక పోవడం అన్యాయమని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఇక్కడి అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మాణాలు చేపడితే చర్యలు….. చివ్వేంల తహసీల్దార్ కృష్ణయ్య. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా 126 సర్వే నెంబర్ లో ఇండ్ల నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాo. ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్ కు మాత్రమే నిబంధనల మేరకు స్థలం కేటాయింపు జరిగింది.నిర్మాణాలపై విచారణ జరుపుతాం.