టీమిండియాకు షాక్‌…


ముంబయి:
బంగ్లాదేశ్-భారత్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో వికెట్‌ తేడాతో బంగ్లా విజయం సాధించింది. ఆ తర్వాత టీమ్‌ ఇండియాకు షాక్‌ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ సోమవారం భారత క్రికెట్ జట్టుకు మ్యాచ్ ఫీజులో 80 శాతం జరిమానా విధించింది. టీమిండియా ఇండియా నిర్ణీత సమయానికి నాలుగు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసినట్లు మ్యాచ్ రిఫరీ రంజన్‌ ముదగల్లే గుర్తించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలో రూల్‌ 2.22 ప్రకారం.. ఓవర్‌ ఆలస్యమైనందుకు ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 20శాతం కోత విధించనుండగా.. మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు ఆలస్యం కావడంతో 80శాతం కోత విధించారు.  ఈ మ్యాచ్‌లో భారత జట్టు 41.2 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ 27 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 24 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులు చేశారు. శిఖర్ ధావన్ ఏడు, విరాట్ కోహ్లీ తొమ్మిది పరుగులు చేశారు. షాబాజ్ అహ్మద్, దీపక్ చాహర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. బంగ్లా బౌలర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఐదు వికెట్లు, ఇబాదత్‌ హుస్సేన్‌ నాలుగు వికెట్లు తీసి భారత్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు. అనంతరం బంగ్లాదేశ్‌ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ లిటన్ దాస్ 41 పరుగులు చేశాడు. మెహ్దీ 38 పరుగులతో అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.