13 జిల్లాల ఎస్టీటీ, భాషా పండితుల స్పౌజ్‌ బదిలీలు తక్షణమే చేపట్టాలి

– జీరో సర్వీస్‌ బదిలీలు అమలు చేయాలి
– 317 జీవోతో ఉద్యోగుల జీవితాలు చిన్నాభిన్నం
– టీచర్లకు ఇబ్బందులు పెట్టిన ఏ ప్రభుత్వం మనుగడసాగించలేదు
– విద్యామంత్రి గారూ మా సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లండి : టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్‌ షౌకత్‌ అలీ
– టీఎస్పీటీఏ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో

బ్లాక్‌ చేసిన 13 జిల్లాల ఎస్జీటీ, భాషా పండితుల స్పౌజ్‌ బదిలీల ఉత్తర్వులను తక్షణమే జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం(టీఎస్పీటీఏ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్‌ షౌకత్‌ అలీ, పిట్ల రాజయ్య విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆ సంఘం ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన టీచర్లు ఫ్లకార్డులు ప్రదర్శించి హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్పౌజ్‌ బదిలీల కోసం ఖాళీలు లేవనే నెపంతో 2300 మంది ఉపాధ్యాయుల బదిలీలు చేయకుండా 13నెలలుగా పెండింగ్‌లో పెట్టారన్నారు. ఎస్జీటీలు ఉపాధ్యా యులు కాదా అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం సెకండరీ గ్రేడ్‌ తత్సమాన క్యాడర్‌లను పక్కన పెట్టి కేవలం స్కూల్‌ అసిస్టెంట్‌లకు మాత్రమే బదిలీలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్కూల్‌ అసిస్టెంట్ల ఓట్లు పొందడానికే ఎస్జీటీలను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్ర ప్రభుత్వం 65 వేల మంది ఎస్జీటీలు, 10వేల మంది భాషా పండితుల కుటుంబాలను నిరాశ పరిచిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 65 వేల ప్రాథమిక ఉపాధ్యాయుల మద్దతు మీకు అవసరం లేదా అని ప్రశ్నించారు. జీవో 317 అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను చిన్నాభిన్నం చేసిందని, ముఖ్యంగా ఈ జీవో వల్ల 20 వేలకు పైగా ఉపాధ్యాయులు దినదిన గండంతో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం జరగనున్న బదిలీలకు జీరో సర్వీస్‌ అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కె.బిక్షపతి, బుర్ర నాగరాజు, ఎస్‌.నరేష్‌, గఫూర్‌, రంగస్వామి, లక్ష్మీకాంతా రెడ్డి, వెంకటరమణ పాల్గొని ప్రసంగించారు. ఈ ధర్నాలో 13 జిల్లాల స్పౌజ్‌ బాధిత ఉపాధ్యాయులు హాజరయ్యారు.