13న ఆయిల్‌ ఫాం రైతు సదస్సు

– కరపత్రం ఆవిష్కరించిన పుల్లయ్య
– హాజరు కానున్న పోతినేని, జూలకంటి, సాగర్‌లు
నవతెలంగాణ-అశ్వారావుపేట
అశ్వారావుపేటలో ఈ నెల 13న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ ఫాం రైతు సదస్సును జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రజాసంఘాల కార్యాలయం సుందరయ్య భవన్‌లో రాష్ట్ర ఆయిల్‌ ఫాం సదస్సు కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం, (కోనేరు బజారు)లో ఈ సదస్సు 13 (మంగళవారం) ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. నేషనల్‌ మిషన్‌ ఫర్‌ ఎడిబుల్‌ ఆయిల్‌-ఆయిల్‌ ఫాంతో కేంద్రం, ఆయిల్‌ ఫెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలతో రాష్ట్రంలో ప్రస్తుతం ఆయిల్‌ ఫాం సాగు ఊపందుకుందని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఆయిల్‌ ఫెడ్‌, ఇతర ప్రైవేట్‌ సంస్థలు మొత్తం 11 కంపెనీల పరిధిలో సుమారు 95 వేల ఎకరాల్లో 25 వేల మంది రైతులు ఫాం ఆయిల్‌ తోటలు సాగు చేస్తున్నారని తెలిపారు. అందులో ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్‌ ఫెడ్‌ పరిధిలో మొత్తం 8 జిల్లాల్లో 62 వేల ఎకరాల్లో 21 వేల మంది రైతులు ఆయిల్‌ ఫాం తోటలు సాగు చేస్తుండగా మిగతా 10 కంపెనీల పరిధిలో కొద్ది శాతం సాగు అవుతుంది అన్నారు. ఇందులో ఆయిల్‌ ఫెడ్‌ జోన్‌ పరిధిలోని 8 జిల్లాల్లో గల 10 మండలాలను భద్రాద్రి కొత్తగూడెం 5, ఖమ్మం జిల్లా 5 ప్రైవేట్‌ సంస్థ అయిన గోద్రేజ్‌కు అని తెలిపారు. ఈ ఫాం ఆయిల్‌ గెలలు నుండి నూనెగా తయారు చేయడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారా వుపేట మండలం నారంవారి గూడెంలో ఒక పురాతన పరిశ్రమ, దమ్మపేట మండలంలో అప్పారావుపేటలో మరో ఆధునిక పరిశ్రమలు ఆయిల్‌ ఫెడ్‌ సంస్థ నిర్వహిస్తుందని, ఆయిల్‌ ఫెడ్‌ జోన్‌ పరిధిలోనే మరో పరిశ్రమ నిర్మించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోద్రేజ్‌ కంపెనీ ప్రయివేట్‌ సంస్థకు అనుమతి ఇచ్చినప్పటికీ నేటికి పరిశ్రమ నిర్మించలేదు అని వివరించారు. ప్రస్తుతం టన్ను పామాయిల్‌ గెలలు ధర రూ.13 వేలు ఉన్నప్పటికీ పెరుగుతున్న ఎరువుల ధరలు, కూలీల వేతనాలు, గెలలు రవాణా రైతులకు వ్యయం తడిసి మోపెడవుతుందన్నారు. పామాయిల్‌ రైతులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర రూ.20 వేలు చెల్లించేలా రైతులు సమిష్టిగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రయివేట్‌ కంపెనీలు పరిశ్రమలు నిర్మించి వారి ఇష్టానుసారం ధరలు నిర్ణయిస్తే ప్రభుత్వ పరిశ్రమలు డీలా పడిపోయే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఆహార ధాన్యాలు ధరలు మాదిరిగా ఆయిల్‌ ఫాం రైతులు సైతం దళారుల భారిన పడి నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఆయిల్‌ ఫిం సాగు చేస్తున్న రైతుల కోసం అశ్వారావుపేటలో నిర్వహించే ఆయిల్‌ ఫాం సాగుదారుల రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొని సాగు దారులుగా మీ అనుభవాలను పాలు పంచు కొనగలరని మద్దతు ధర మరియు పామాయిల్‌ రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు పరిష్కరించు కొనుటకు ఈ సదస్సులో పాల్గొన గలరని కోరారు.
ఈ సదస్సుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ రావు, ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగా రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.సిగర్‌ హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తగరం జగన్నాధం, కలపాల భద్రం, వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.