– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
– వర్చువల్‌గా టీ డయాగస్టిక్స్ సెంటర్స్ ప్రారంభం
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిలో భాగంగా తెలంగాణ డయాగస్టిక్స్‌లో మరో 134 వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన టీ డయాగస్టిక్స్ హబ్‌ను రంగారెడ్డి జిల్లా కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో గల జిల్లా ప్రభుత్వ దవాఖాన నుంచి వర్చువల్‌గా మంత్రి శనివారం ప్రారంభించారు. అనంతరం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో
తెలంగాణ డయాగస్టిక్స్‌లో మరో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 8 డయాగస్టిక్స్ సెంటర్లు, 16 రేడియాలజీ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. తెలంగాణ డయాగస్టిక్స్ ద్వారా ఇప్పటివరకు 54 పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని, మరో 134 వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను రోగి మొబైల్‌కు పంపిస్తారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా స్కాన్, 2డి-ఎకో రేడియాలజీ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు చాలా కష్టపడ్డారని కొనియాడారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30శాతం ప్రసవాలు జరిగితే.. ఇప్పుడు 70 శాతం అవుతున్నాయని తెలిపారు. పేద ప్రజలకు నిమ్స్‌లో అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని, హైదరాబాద్ చుట్టు పక్కల నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాట్లాడుతూ.. పేదల కోసమే తెలంగాణ డయాగస్టిక్ సేవలు ప్రారంభించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 27 లక్షలు మంది టి డయాగస్టిక్ సేవలు వినియోగించుకున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, బండ ప్రకాష్, తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మెన్ ఉప్పాల శ్రీనివాస్‌గుప్తా, జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిక్‌జైన్, హెల్త్ కమిషనర్ శ్వేతామెహంతి, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డీిఎంహెచ్‌ఓ సృజన, కార్పొరేటర్లు, కొండాపూర్ ప్రభుత్వ జిల్లా ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ వరదాచారి తదితరులు పాల్గొన్నారు.