టీ-డయాగ్నోస్టిక్స్‌లో నేటి నుంచి 134 టెస్టులు

– ఇప్పటివరకు 57 టెస్టులు అందుబాటులో
– నూతనంగా 8 జిల్లాల్లో పాథాలజీ, 16 జిల్లాల్లో రేడియాలజీ హబ్‌లు ఏర్పాటు
– రంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభించనున్న హరీశ్‌రావు
– టీ డయాగ్నోస్టిక్స్‌ ద్వారా ఇప్పటివరకు 10 కోట్లకుపైగా టెస్టులు పూర్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో టీ-డయాగ్నోస్టిక్స్‌ సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇప్పటివరకు టీ-డయాగ్నోస్టిక్స్‌ ద్వారా ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా 57 రకాల వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. టెస్టుల సంఖ్యను 134కు పెంచారు. దీంతోపాటు కొత్తగా 8 జిల్లాల్లో పాథాలజీ ల్యాబులు, 16 జిల్లాల్లో రేడియాలజీ ల్యాబులు సేవలందించేందుకు సిద్ధమయ్యాయి. వీటిని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోని జిల్లా దవాఖాన నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. కొత్తగా అందుబాటులోకి రానున్న టెస్టుల్లో ప్రయివేటు ల్యాబుల్లో రూ.500 నుంచి రూ.10వేల వరకు ఖరీదు చేసే పరీక్షలు కూడా ఉన్నాయి. 2018 జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పీహెచ్‌సీ నుంచి అన్ని స్థాయిల దవాఖానల్లో ఉచిత పరీక్షలు ప్రారంభమయ్యాయి. 57 రకాల పాథాలజీ (రక్త, మూత్ర) పరీక్షలతో పాటు, ఎక్స్‌రే, యూసీజీ, ఈసీజీ, 2డీ ఈకో, మామోగ్రామ్‌ వంటి రేడియాలజీ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయివేటులో ఖర్చుల భారం, ఆ భారానికి భయపడి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోకుండా రోగం ముదిరే వరకు తెచ్చుకోవడం వంటి సమస్యలు తప్పాయి. దీంతో పాటు 24 గంటల్లోనే కచ్చితమైన ఫలితాలు వస్తుండటంతో వైద్యులకు చికిత్స అందించడం సులువుగా మారింది.
10 కోట్లకు పైగా టెస్టులు పూర్తి..
హైదరాబాద్‌లో సెంట్రల్‌ ల్యాబ్‌తోపాటు 19 మినీ హబ్‌లు, 435 స్పోక్స్‌కు (అనుసంధానిత కేంద్రాలు) విస్తరించింది. మరో 19 జిల్లా కేంద్రాల్లో హబ్‌లు ఉన్నాయి. మిగతా 13 జిల్లాల్లో హబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం గతేడాది అనుమతించిన సంగతి తెలిసిందే. వీటిలో 8 హబ్‌ల పనులు పూర్తయ్యాయి. రంగారెడ్డి (కొండాపూర్‌), సూర్యాపేట, వనపర్తి, వరంగల్‌ (నర్సంపేట), యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ల్యాబ్‌లో నాణ్యత ప్రమాణాలు అత్యుత్తమంగా పాటిస్తున్నారంటూ ఇప్పటికే ఎన్‌ఏబీఎల్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన విషయం విదితమే. 13 జిల్లా ల్యాబులు ఎన్‌ఏబీఎల్‌ ప్రాథమిక అక్రిడిటేషన్‌ సాధించాయి. మరో ఆరు ల్యాబుల తనిఖీ కొనసాగుతున్నది. ఇప్పటివరకు టీ డయాగ్నోస్టిక్స్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 57.68 లక్షల మందికి 10 కోట్లకు పైగా టెస్టులు నిర్వహించారు. 57.68 లక్షల మంది రోగులు ప్రయోజనం పొందారు.
జిల్లాకు ఒక రేడియాలజీ హబ్‌
రేడియాలజీ పరీక్షలు మరింత నాణ్యంగా, వేగంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక రేడియాలజీ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
32 రేడియాలజీ హబ్‌ల ఏర్పాటుకు గతేడాది అనుమతించింది. ఇందులో ఇప్పటివరకు 13 హబ్‌ల పనులు పూర్తయ్యాయి. హన్మకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ (నర్సంపేట), వనపర్తి, రంగారెడ్డి, పెద్దపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి (హైదరాబాద్‌), నారాయణపేట జిల్లాల్లో రేడియాలజీ హబ్‌లు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.