నవతెలంగాణ -విలేకరులు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండో రోజూ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. శనివారం మొత్తం 140 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు మంథని నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఖమ్మం జిల్లా మధిరలో బీఆర్‌ఎస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి నామినేషన్ వేశారు. ఖమ్మం నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు తరపున ప్రపోజర్ కె.గోపాల్‌రావు 2వ సెట్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2 సెట్ల నామినేషన్ పత్రాలను అతని సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి దాఖలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాంగ్రెస్ తరపున జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య నామినేషన్ వేశారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 14 నామినేషన్లు దాఖలు అయ్యాయి. బాన్సువాడ పట్టణంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనవాస్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండో రోజు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్‌రెడ్డి నామినేషన్ వేశారు. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కాలే యాదయ్య, ఎల్‌బీనగర్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి, రాజేందర్‌నగర్ బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్లు వేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. నల్లగొండ జిల్లాలో 23మంది, సూర్యాపేటలో నాలుగు, యాదాద్రిభువనగిరి జిల్లాలో నాలుగు నామినేషన్లు దాఖలు చేశారు.