బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ)కు త్వరలోనే భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చనున్నట్టు కర్నాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మొత్తం 1,400 కొత్త బస్సులను బీఎంటీసీకి ఇవ్వనున్నట్టు చెప్పారు. తొలి దశలో భాగంగా మంగళవారం 100 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులకు విధాన సౌధ వద్ద పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ‘శక్తి’ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 120 కోట్ల రైడ్‌లు ఉచితంగా చేశారన్నారు. మొత్తంగా బెంగళూరులో ప్రతి రోజూ 40లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. కొత్త ఎలక్ట్రిక్ బస్సులతో ప్రజా రవాణాను ప్రోత్సహించడంతో పాటు నగరంలో పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని నియంత్రించవచ్చని సీఎం తెలిపారు.
ఉచిత ప్రయాణంపై బీజేపీ విమర్శలకు కౌంటర్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సేవలపై బీజేపీ విమర్శలు చేస్తున్నదనీ, మరి, వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ సంక్షేమ పథకాన్ని ఎందుకు అమలు చేయలేదని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న గ్యారంటీలతో ప్రజల కొనుగోలు శక్తితో పాటు ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయన్నారు. కార్మికులు, రైతులు, మహిళల డబ్బు చాలా వరకు ఆదా అవ్వడం ద్వారా లక్షలాది కుటుంబాల ఆర్థిక శక్తి పెరుగుతోందని వివరించారు. తమ ప్రభుత్వం అమలుచేస్తోన్న గ్యారంటీ పథకాల ద్వారా రాష్ట్రంలో 4.30 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా లబ్దిపొందుతున్నారని సీఎం తెలిపారు.