– ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న 60 కంపెనీలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు 145 కంపెనీల కేంద్ర బలగాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇందులో 60 కంపెనీల కేంద్ర పోలీసు బలగాలను రాష్ట్రానికి పంపారు. కాగా, మిగతా 85 కంపెనీలను పోలింగ్ తేదీ నాటికి పంపించనున్నారని రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజరు కుమార్ జైన్ ‘నవతెలంగాణ’తో మాట్లాడుతూ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల బందోబస్తు కోసం 345 కంపెనీల బలగాలను కేంద్రం పంపిందని చెప్పారు. అయితే, లోక్‌సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్న దృష్ట్యా.. అన్ని రాష్ట్రాలకు శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం కేంద్ర బలగాలను ఎన్నికల కమిషన్ కేటాయించవల్సి ఉంటుందనీ, ఈ కారణంగా రాష్ట్రానికి కోరినన్ని బలగాలు పంపించటం సాధ్యం కాదని సంజరుకుమార్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్(ఏఆర్) పోలీసులు, స్పెషల్ పోలీస్ బెటాలియన్స్‌కు చెందిన బలగాలు, ఎస్పీఎఫ్ పోలీసు బలగాలు, హౌంగార్డులు కలిపి దాదాపు 60వేల మంది పోలీసులను కూడా ఎన్నికల బందోబస్తుకు వినియోగిస్తున్నట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం రాష్ట్రానికి చేరుకున్న బలగాలలో సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎస్, ఐటీబీపీకి చెందిన బలగాలున్నాయని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న సున్నితమైన ప్రాంతాలకు ముందస్తు చర్యగా కేంద్ర బలగాలను కేటాయించినట్టు జైన్ చెప్పారు. మొత్తమ్మీద, రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించేలా పోలీసులకు తగిన దిశానిర్దేశం చేయటం జరిగిందనీ, ముఖ్యంగా, ఓటర్లను ప్రలోభపెట్టే క్రీడా సామాగ్రి, చీరల పంపిణీ, డబ్బుల పంపిణీని నిరోధించటానికి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి రంగంలోకి దించామని ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు అటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఎన్నికలు ప్రశాంతంగా ముగియటానికి భద్రతాపరంగా అన్ని విధాలా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టినట్టు ఆయన వివరించారు.