– హౌరాలో మూడు రోజుల పాటు …
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
అఖిల భారత న్యాయవాద సంఘం (ఐలు) 14వ అఖిల భారత మహాసభ నేడు ప్రారంభం కానుంది. నేటీ నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, న్యాయం, సామ్యవాదం లక్ష్యంతో దేశవ్యాప్తంగా 50,000కు పైగా న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, న్యాయ అధ్యాపకుల సభ్యత్వం కలిగిన ఐలు 14వ అఖిల భారత మహాసభ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నగరంలో ప్రారంభమవుతున్నాయి. మతోన్మాదంపై పోరాటం, ‘సేవ్ రాజ్యాంగం, సేవ్ ప్రజాస్వామ్యం’ నినాదంతో ఈ మహాసభలు జరుగుతున్నాయి. అశోక్ బికాష్ మంచ్, నారా నారాయన్ గుప్తా నగర్‌లో మహాసభ జరగనుంది. ఈ మహాసభల ప్రారంభానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ గుప్తా, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్. మురళీధర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ గంగూలీ పాల్గొంటారు. దేశంలో ప్రజాస్వామ్యం, సోషలిజం, చట్టబద్దమైన పాలన, ఒకే నేషన్-ఒకే ఎలక్షన్ వంటి అనేక అంశాల మీద, రాజ్యాంగపరమైన అంశాలమీద చర్చించనున్నారు. న్యాయవాదుల హక్కుల పరిరక్షణ కోసం, న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ మహాసభలో చర్చించనున్నారు. ఐలు కొత్త కమిటీని ఈ మహాసభలో ఎన్నుకోనున్నారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి 600 మంది న్యాయవాదులు ప్రతినిధులుగా ఈ మహాసభలో పాల్గొననున్నారు. న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, న్యాయ ఆధ్యాపకుల సమస్యలను చట్టబద్దంగా పరిష్కరించేందుకు కూలంకషంగా ఈ మహాసభలో చర్చించనున్నారు. ఈ మహాసభని జయప్రదం చేయాలని అఖిల భారత న్యాయవాద సంఘం కార్యదర్శి నర్రా శ్రీనివాస రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ మాధవరావు ఒక ప్రకటనలో కోరారు.