15 రోజులు… 54 నియోజకవర్గాలు

– సీఎం కేసీఆర్‌ ప్రచారం షెడ్యూల్‌ ఖరారు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 13 నుంచి 28వ తేదీ వరకు 15 రోజుల్లో 54 నియోజకవర్గాల్లో విస్త్రుత ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందించారు.
ఇప్పటి వరకు 30 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల పేరుతో సుడిగాలి పర్యటనలు చేస్తూ, పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న ఆయన ఈ స్పీడ్‌ను మరింత పెంచారు. రోజూ కనీసం మూడు నుంచి నాలుగు నియోజవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. ఈ నెల 9 నుంచి 12 వరకు జరిగే సభల షెడ్యూల్‌ గతంలోనే ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 9న సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేస్తారు.
25న హైదరాబాద్‌లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. 28వ తేదీ వరంగల్‌ ఈస్ట్‌, వెస్ట్‌ నియోజవర్గాలతో పాటు తాను పోటీచేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో జరిగే సభతో ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు.