న్యూఢిల్లీ : పొదుపు చర్యల్లో భాగంగా విమానయాన సంస్థ స్పైస్‌జెట్ భారీగా ఉద్యోగులను తొలగించడానికి కసరత్తు చేస్తోంది. గత కొద్ది నెలలుగా ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో జాప్యం, ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవాలని భావిస్తోన్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. స్పైస్‌జెట్‌లో ప్రస్తుతం దాదాపు 9000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 30 విమానాలను నిర్వహిస్తుంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగించక తప్పడం లేదని స్పైస్‌జెట్ వర్గాలు తెలిపాయి. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో దాదాపు 1,350 మందిని తీసివేయనుంది. ఇది మొత్తం సిబ్బందిలో 15 శాతానికి సమానం. జనవరి నెల వేతనం ఇప్పటికీ కొంతమందికి చెల్లించలేదని తెలుస్తోంది. ఇటీవల అమెజాన్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, స్నాప్‌చాట్, ఈబే తదితర సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
సిస్కోలోనూ ఉద్వాసన
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం సిస్కో భారీగా కొలువుల కోతకు సిద్దం అయ్యింది. వచ్చే వారం నుంచి వేలాది మంది ఉద్యోగులపై సిస్కో వేటు వేయనుందని సమాచారం. ఫిబ్రవరి 14న పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయి. సిస్కోలో ప్రపంచ వ్యాప్తంగా 84,900 మంది పని చేస్తున్నారు. 2022 నవంబర్‌లో దాదాపు 5 శాతం ఉద్యోగులను తొలగించింది. కాగా.. ఈ ఏడాది ఎంత మందికి ఉద్వాసన పలకనుందో వేచి చూడాలి.