రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలి

– బాలల హక్కుల పరిరక్షణ వేదిక, తల్లుల సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక, తల్లుల సంఘం డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వేదిక రాష్ట్ర కన్వీనర్‌ జి.వేణుగోపాల్‌, తల్లుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ జి.భాగ్యలక్ష్మి తదితరులు మాట్లాడారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో దేశంలోనే విద్యారంగంలో రాష్ట్రం 35వ స్థానానికి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గుర్తుచేశారు. నిధుల లేమి కారణంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా తయారైందని తెలిపారు. టీచర్ల కొరత, మౌలిక సదుపాయాల లేమి, అటెండర్లు, ఆయాల నియామకం లేకపోవడంతో అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రయివేటు పాఠశాలల విద్యార్థుల విద్యాసామర్థ్యాలు తగ్గిపోయాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అధ్యయనంలో వెల్లడైనట్టుగానే తాము 2018 నుంచి మండలాల వారీగా పెడుతున్న పరీక్షల్లోనూ విద్యార్థుల్లో సామర్థ్యం కనిపించడం లేదని చెప్పారు. విద్యార్థులకు రవాణా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. మధ్యాహ్న భోజనంలో పప్పుతో పాటు ఒక కూరను విధిగా పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులకు ఉదయం అల్పాహారం ఇవ్వకపోవడంతో ఆకలితో చదువులపై శ్రద్ధ చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 475 కేజీబీవీల్లో ఒక లక్షా 15 వేల మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారనీ, దీన్ని దృష్టిలో ఉంచుకుని సౌకర్యాల కల్పనకు నిధులివ్వాలని కోరారు. సంక్షేమశాఖల పరిధిలో 850 గురుకులాలు, 1,523 సంక్షేమ హాస్టళ్లున్నాయని తెలిపారు. 850 గురుకులాలకు 415 అద్దె భవనాల్లో నడుస్తున్నాయని చెప్పారు. వీటికి కొత్త భవనాలతో పాటు, మౌలిక వసతులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక కార్యదర్శి సీహెఛ్‌.లక్ష్మినారాయణ, తల్లుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.