– బ్యాడ్మింటన్ స్కోరింగ్‌లో కొత్త ప్రయోగం
కౌలాలంపూర్ (మలేషియా): కమర్షియల్, కార్పొరేట్ రంగు పులుముకున్న క్రీడలు జనాకర్షణ కోసం సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యూఎఫ్) సైతం అదే తరహాలో ఆలోచన చేస్తోంది. గేములను మరింత రక్తి కట్టించేందుకు, మ్యాచ్‌లో ఉత్కంఠ పెంచేందుకు, అభిమానులకు చేరువ అయ్యేందుకు స్కోరింగ్ సిస్టమ్‌ను మార్చే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం బ్యాడ్మింటన్‌లో ప్రతి మ్యాచ్‌లో మూడు గేములు, ప్రతి గేమ్‌లో 21 పాయింట్లు స్కోరింగ్ పద్దతి నడుస్తోంది. మూడు గేముల ఫార్ములాను కొనసాగిస్తూ పాయింట్లను 15కు కుదించనున్నారు. బిడబ్ల్యూఎఫ్ గ్రేడ్ 3 టోర్నమెంట్లలో ఆరు నెలల పాటు ఈ స్కోరింగ్ పద్దతిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అనంతరం ఫలితాల నివేదికను 2026 వార్షిక సర్వ సభ్య సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం కోరనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కొత్త స్కోరింగ్ పద్దతిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.