– సింగరేణిలో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం
– త్వరలో గ్రూప్ -1 నోటిఫికేషన్
– అదనంగా 60 ఖాళీలు : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వచ్చే 15 రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అలాగే 60 కొత్త ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కావాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేసారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్పూర్తికి నిదర్శనంగా, అంబేద్కర్ విగ్రహ సాక్షిగా నియామక పత్రాలను అందజేస్తున్నామని చెప్పారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను ఎవరూ తగ్గించలేరని అన్నారు. గత ప్రభుత్వం సింగరేణిని ఖాయిలా పడేలా చేసిందనీ, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ సంస్థకు అనేక అడ్డంకులు సృష్టించిందని తెలిపారు. గత ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం కాంగ్రెస్‌కు అండగా నిలిచి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిందని గుర్తుచేశారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ అనుబంధ సంఘానికి సింగరేణి ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని చెప్పారు. సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఇటివలే ఆదేశాలిచ్చామని తెలిపారు. సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించే అంశంపై చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే కారుణ్య నియామకాల వయసు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్‌సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, కోవా లక్ష్మీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సింగరేణి ఎమ్‌డీ బలరాంనాయక్, ఐఎన్‌టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.