న్యూఢిల్లీ : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు రూ.223 లక్షల కోట్ల విలువ గల 15,547 కోట్ల లావాదేవీలను పూర్తి చేసినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. భారత్‌కు సంబంధించిన డిజిటల్ చెల్లింపుల విప్లవం ఇతర దేశాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం యూపీఐ… యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి కీలక మార్కెట్లలో పనిచేస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ద్వారా 2016లో ప్రారంభమైన యుపిఐ, ఒక మొబైల్ అప్లికేషన్‌తో బహుళ బ్యాంకు ఖాతాలను ఏకీకృతం చేయడం ద్వారా దేశానికి సంబంధించిన చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఈ సిస్టం ద్వారా ఇబ్బందులు లేకుండా నిధుల బదిలీ, వ్యాపారులకు చెల్లింపులు, పీర్-టు-పీర్ లావాదేవీలను అనుమతినిస్తుంది. 2024, అక్టోబర్‌లో యుపిఐ (1,658 కోట్ల ఆర్థిక లావాదేవీలతో) రూ.23.49 లక్షల కోట్ల విలువ గల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. 632 బ్యాంకులు యుపిఐ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానం కలిగి ఉన్నాయి.