పీఎన్‌బీ లాభాల్లో 159 శాతం వృద్ధి

– తగ్గిన మొండి బాకీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు మెరుగైన ప్రగతిని కనబరుస్తున్నాయ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నికర లాభాలు 159 శాతం వృద్ధితో రూ.3,252 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,255 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.9,504 కోట్లుగా ఉన్న బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ).. గడిచిన క్యూ4లో 10.23 శాతం పెరిగి రూ.10,476 కోట్లుగా చోటు చేసుకుంది. 2024 జూన్‌ ముగింపు నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు ఏకంగా 275 బేసిస్‌ పాయింట్లు తగ్గి 4.98 శాతానికి పరిమితమయ్యాయి. నికర నిరర్థక ఆస్తులు 138 బేసిస్‌ పాయింట్లు మెరుగుపడి 0.60శాతానికి తగ్గాయి. కరెంట్‌ ఎకౌంట్స్‌ను మెరుగు పర్చడానికి సెప్టెంబర్‌ ముగింపు కల్లా కార్పొరేట్ల కోసం మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించే యోచనలో ఉన్నామని పీఎన్‌బీ ఎండీ, సీఈ అతుల్‌ కుమార్‌ తెలిపారు. గడిచిన జూన్‌ త్రైమాసికంలో రిటైల్‌ రుణాల్లో 14.4 శాతం, గృహ రుణాల్లో 14.7 శాతం చొప్పున వృద్థి చోటు చేసుకున్నట్లు తెలిపింది.
ఎన్‌టిపిసికి రూ.45,053 కోట్ల ఆదాయం
దేశంలోనే అతిపెద్ద విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీ ఎన్‌టటీపీసీ 2024-25 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(క్యూ1)లో ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సంస్థ నికర లాభాలు 12 శాతం పెరిగి రూ.5,506.07 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.4,907 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ1లో సంస్థ మొత్తం ఆదాయం 48,981.68 కోట్లకు చేరింది. ఏడాది క్రితం ఇదే సమయంలో రూ.43,390.02 కోట్ల ఆదాయం ప్రకటించింది.