జీహెచ్‌ఎంసీలోకి కంటోన్మెంట్‌..!

– వేగవంతమైన విలీన ప్రక్రియ
– నేడో, రేపో రక్షణ మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ
నవతెలంగాణ-కంటోన్మెంట్‌
హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీలో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు రక్షణ శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సంసిద్ధతను తెలియజేస్తూ రక్షణ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాల్సిందిగా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ ఉన్నతాధికారులకు చీఫ్‌ సెక్రటరీ సూచించారు. దాంతో మున్సిపల్‌ శాఖ అధికారులు లేఖను సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దాంతో కంటోన్మెంట్‌ సివిలియన్‌ ప్రాంతాలు జీహెచ్‌ఎంసీలో కలిపే ప్రక్రియ ఇక వేగవంతం కానుందని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా కంటోన్మెంట్లలోని సివిలియన్‌ ప్రాంతాలను సమీప మున్సిపాల్టీల్లో విలీనం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం కోసం లేఖలు రాసింది. తెలంగాణ ప్రభుత్వంతో సైతం ఆగస్టులో అందుకు సంబంధించిన కమిటీ భేటీ అయింది. అనంతరం ఈ విషయంపై ఉన్నత స్థాయిలో సంప్రదింపులు కొనసాగుతూ వచ్చాయి. ఇదిలా ఉండగా, కంటోన్మెంట్‌ జీహెచ్‌ఎంసీలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ ఆర్మీ ఆంక్షల వల్ల స్థానికులకు మెరుగైన పౌరసేవలు, సదుపాయాలు దక్కడం లేదనే ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో కలపాల్సిందిగా కొన్నేండ్లుగా డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆర్మీ ఉన్నతాధికారులు సైతం కంటోన్మెంట్లకు ప్రతియేటా సర్వీసు చార్జీలు చెల్లించాల్సి రావడం తమకు ఆర్థిక భారంగా మారిందని భావిస్తూ.. సివిలియన్‌ ప్రాంతాలను వేరు చేయాల్సిందిగా ఐదేండ్ల కిందటే మంత్రిత్వ శాఖను కోరారు. ఈ ప్రతిపాదనకు అనుగుణంగా ఏర్పాటైన సుమిత్‌ బోస్‌ కమిటీ తన ప్రతిపాదనల్లో.. ఆ ప్రాంతాల విలీనంతోపాటు 2006 నాటి కంటోన్మెంట్‌ చట్టంలో మార్పులు చేస్తూ 2020లో నూతన బిల్లును రూపొందించారు. రెండేండ్లుగా ఈ బిల్లు పార్లమెంట్‌ సమావేశాల ఎజెండాల్లో ఉంటున్నప్పటికీ ఆమోదానికి నోచుకోవడం లేదు. ఇదిలా ఉండగానే, కంటోన్మెంట్లను సమీప మున్సిపాల్టీల్లో విలీనానికి సంబంధించిన ప్రక్రియ సమాంతరంగా కొనసాగుతూ వస్తోంది. పలు రాష్ట్రాలు తమ పరిధిలోని కంటోన్మెంట్ల విలీనానికి ఇదివరకే సమ్మతి వ్యక్తం చేయగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. దాంతో విలీనం ఇక లాంఛనమే అని తెలుస్తోంది.
అసలు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎలా ఏర్పడిందంటే..?
దేశంలో 62 కంటోన్మెంట్లలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అతి పెద్దది. ఆనాడు దేశంలో బ్రిటిష్‌ పాలన రోజుల్లో నిజాంల అవసరాల కోసం 13 మొఘలాయి గ్రామాలను బ్రిటీషర్లకు అప్పగించారు. అక్కడ బ్రిటిష్‌ సైనికులు రెజిమెంట్లను ఏర్పాటు చేసుకొని ఉండేవారు. వారు సివిలియన్స్‌ ప్రాంతాలను ‘బజారులు’ అని నామకరణ చేసుకున్నారు. ఆ ప్రాంతాలను అప్పట్లో కంటోన్మెంట్‌ అని పిలిచేవారు. బ్రిటిష్‌ కాలం అంతరించిన తర్వాత వాటిలో కొన్ని ప్రాంతాలు నాటి బల్దియాలో విలీనమయ్యాయి. ఆ తర్వాత కూడా కంటోన్మెంట్‌లో అనేక సివిల్‌ కాలనీలు పుట్టుకొచ్చాయి. దాంతో కంటోన్మెంట్‌ ప్రాంతంలో సివిలియన్స్‌ సంఖ్య పెరిగింది. ఆ తర్వాత కాలానుగుణంగా ఆర్మీ స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, క్వార్టర్లు ఇతరత్రా కార్యాలయాలు విస్తరించి ఉన్నాయి. మరో వెయ్యి ఎకరాల స్థలం కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. 2,800 ఎకరాల్లో 400కు పైగా కాలనీలు, 50కిపైగా బస్తీల్లో సివిలియన్‌ ప్రాంతాలున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో సుమారు 4 లక్షల జనాభా ఉంది.