178 కిలోల గంజాయి పట్టివేత

– సుమారు రూ.60లక్షల విలువ
– వివరాలు వెల్లడించిన శంషాబాద్‌ జోన్‌ డీసీపీ నారాయణరెడ్డి
నవతెలంగాణ-శంషాబాద్‌
గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.60లక్షల విలువ చేసే 178 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్‌ జోన్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన బైద్యధర్‌ కీర్తానియా, ప్రశాంత్‌ బిస్వాస్‌, ఒడిశాలోని మల్కాన్‌ గిరికి చెందిన సిప్రా కాజీ.. మరికొందరితో కలిసి ఈ నెల 14న ప్రధాన నిందితుడు దీపాంకర్‌ ఆంధ్రప్రదేశ్‌ మోతుగూడెంలో రహస్యంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి వద్ద నుంచి 89 ప్యాకెట్లు (సుమారు 178 కిలోలు) కొనుగోలు చేసి కర్నాటకలోని బెంగళూరుకు తరలించేందుకు ప్రయత్నం చేశాడు. తరలించే క్రమంలో డ్రైవర్లకు రూ.40 వేలు, ఎస్కార్ట్‌ వాహనదారులకు రూ.10 వేల చొప్పున ఇచ్చారు. కాగా ఈ నెల 15న అక్రమ రవాణా చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుకున్న.. మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు.. షాద్‌నగర్‌ రూరల్‌ పోలీసులతో కలిసి లాల్‌ పహాడ్‌ చౌరస్తా సమీపంలోని జీబీబీఐ బిస్కెట్‌ కంపెనీ వద్ద నిఘా పెట్టారు. గంజాయి తరలిస్తున్న రెండు వాహనాలను ఆదివారం అడ్డగించారు. వాహనాలు తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. మొత్తం గంజాయి 178కిలోలు కాగా.. దాని విలువ సుమారు రూ. 60లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బైద్యధర్‌ కీర్తానియా, ప్రశాంత్‌ బిస్వాస్‌, సిప్రా కాజీతోపాటు ఓ మహిళను అరెస్టు చేశారు. ఒడిశాలోని మల్కాన్‌గిరికి చెందిన దెబాషిస్‌, విశ్వనాథ్‌, దీపాంకర్‌, బెంగళూరుకు చెందిన జుబేర్‌ పరారీలో ఉన్నారు. దీపాంకర్‌ పాత నేరస్థుడు. ఇతనిపై ఆర్‌సీపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గతంలో కేసు నమోదైంది. గంజాయిని పట్టుకున్న శంషాబాద్‌ జోన్‌ ఎస్‌ఓటీ డీసీపీ రషీద్‌, అదనపు ఎస్‌ఓటీ డీసీపీ రామ్‌ కుమార్‌, శంషాబాద్‌ జోన్‌ అదనపు ఎస్‌ఓటీ డీసీపీ నారాయణగౌడ్‌, షాద్‌నగర్‌ ఏసీపీ రంగస్వామిలను డీసీపీ నారాయణరెడ్డి అభినందించారు.