18 రోజులు 22 మ్యాచులు

–   ఆరంభ మ్యాచ్‌లో ముంబయి, గుజరాత్‌ ఢీ
–  మార్చి 26న డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌
–  మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 2023 షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ-ముంబయి
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఆరంభ సీజన్‌ దిశగా అన్ని పనులు శరవేగంగా సాగుతు న్నాయి!. వరుసగా ప్రాంఛైజీల వేలం, క్రికెటర్ల వేలం ముగించిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ).. తాజాగా అరంగేట్ర సీజన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. 18 రోజుల పాటు సాగనున్న డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్‌లో 22 మ్యాచులు జరుగనున్నాయి. మార్చి 4న ముంబయి ఇండియన్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో తలపడనుండగా.. మార్చి 26న డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ పోరు జరుగనుంది. ఈ మేరకు బీసీసీఐ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 2023 షెడ్యూల్‌ విడుదల చేసింది.
డబుల్‌ హెడర్స్‌
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచులన్నీ ముంబయిలోనే నిర్వ హిస్తున్నారు. డివై పాటిల్‌ స్టేడియం, బ్రబౌర్న్‌ స్టేడియం (క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా)లో 22 మ్యాచులు జరుగు తాయి. నాలుగు రోజులు డబుల్‌ హెడర్స్‌ ఉండనున్నాయి. డబుల్‌ హెడర్స్‌ రోజు తొలి మ్యాచ్‌ మధ్యాహ్నాం 3.30 గంటలకు ఆరంభం కానుండగా.. రెండో మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవనుంది.
ఇదీ ఫార్మాట్‌
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభ సీజన్‌లో ఐదు జట్లు టైటిల్‌ కోసం పోటీపడుతున్నాయి. ముంబయి ఇండియన్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, యూపీ వారియర్స్‌లు గ్రూప్‌ దశలో డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ పద్దతిలో తలపడనున్నాయి. గ్రూప్‌ దశలో 20 మ్యాచులు ముగిసిన అనంతరం అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. గ్రూప్‌ దశలో 2, 3వ స్థానాల్లో నిలిచిన జట్లు రెండో ఫైనల్‌ బెర్త్‌ కోసం ఎలిమినేటర్‌లో పోటీపడతాయి. గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌ యూపీ వారియర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ (మార్చి 21) మధ్య జరుగనుండగా.. ఎలిమినేటర్‌ పోరు మార్చి 24న జరుగుతుంది. ఫైనల్‌కు ముందు రోజు విరామం ఇచ్చారు. బ్రబౌర్న్‌ స్టేడియం, డివై పాటిల్‌ స్టేడియాలు గ్రూప్‌ దశలో మ్యాచుల వారీగా ఐదు జట్లకు రొటేషన్‌ పద్దతిలో ఆతిథ్య మైదానంగా వ్యవహరించనున్నాయి.